సాక్షి, హైదరాబాద్: కౌంట్‌డౌన్ పూర్తయింది... ఇక హైదరాబాద్ స్ట్రీట్‌పై జనరేషన్–3 కార్లు జోరుగా దూసుకుపోవడమే మిగిలింది. భాగ్యనగర రేసింగ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫార్ములా ‘ఇ’ సమరానికి సమయం వచ్చేసింది. హుస్సేన్ సాగర్ తీరంలో ప్రత్యేకంగా సిద్ధమైన స్ట్రీట్ సర్క్యూట్‌లో కార్లు జూమ్మంటూ దూసుకుపోతుంటే ఆ వినోదాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. మొత్తం 11 జట్లకు చెందిన 22 మంది డ్రైవర్లు ఈ ‘ఇ’ ప్రి పోరులో సత్తా చాటబోతున్నారు. శుక్రవారమే తొలి ఫ్రీ ప్రాక్టీస్ పూర్తి కాగా, డ్రైవర్లు శనివారం ఉదయం రెండో ఫ్రీ ప్రాక్టీస్‌లో కూడా పాల్గొంటారు. ఆ తర్వాత క్వాలిఫయింగ్ ఈవెంట్ అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రధాన రేస్ జరుగుతుంది.
ఆధిక్యంలో ఆండ్రెటీ...
ఫార్ములా ‘ఇ’లో ప్రస్తుతం 9వ సీజన్ నడుస్తోంది. ఇందులో ఇప్పటికే మూడు రేస్‌లు పూర్తయ్యాయి. మెక్సికో సిటీ మొదటి రేస్‌కు ఆతిథ్యం ఇవ్వగా, సౌదీ అరేబియాలోని దిరియాలో తర్వాతి రెండు రేస్‌లు జరిగాయి. హైదరాబాద్‌లో జరగబోతోంది ఈ సీజన్‌లో నాలుగో రేస్. ప్రస్తుతం మూడు రేస్‌ల తర్వాత మొత్తం 76 పాయింట్లతో ఆండ్రెటీ టీమ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పోర్‡్ష (74) రెండో స్థానంలో ఉంది.
మహీంద్రా సాధించేనా...
ఫార్ములా ‘ఇ’ ప్రారంభమైన 2014 సీజన్ నుంచి భారత్‌కు చెందిన మహీంద్రా రేసింగ్ టీమ్ బరిలో ఉంది. ఓవరాల్‌గా ఇన్నేళ్లలో 5 రేస్‌లు గెలిచిన ఆ జట్టు డ్రైవర్లు 24 సార్లు పోడియం (టాప్–3)పై నిలబడటంలో సఫలమయ్యారు. 2016–17 సీజన్‌లో టీమ్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా మూడో స్థానంలో నిలిచిన టీమ్... తొలిసారి స్వదేశంలో పోటీకి సిద్ధమైంది. మహీంద్ర టీమ్‌లో బ్రిటన్‌కు చెందిన ఒలివర్ రోలండ్, బ్రెజిల్‌కు చెందిన ల్యూకాస్ గ్రాసి డ్రైవర్లుగా వ్యవహరిస్తుండగా... భారత యువ రేసర్ జెహాన్ దారువాలా రిజర్వ్ డ్రైవర్‌గా ఉన్నాడు. గత సీజన్‌లో టీమ్ ఎనిమిదో స్థానానికే పరిమితమైంది. తాజా సీజన్‌లో మెక్సికో సిటీలో జరిగిన తొలి రేస్‌లో గ్రాసీ మూడో స్థానం సాధించడంతో 18 పాయింట్లు టీమ్ ఖాతాలో చేరాయి. దాంతో పట్టికలో మహీంద్రా ప్రస్తుతం ఆరో స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన ఇస్తుందనేది ఆసక్తికరం.
షాంపేన్ కాదు..రంగు కాగితాలే...
రేసింగ్ సర్క్యూట్‌లో ఫలితం వచ్చిన తర్వాత విజేతలు షాంపేన్ బాటిల్‌తో సంబరాలు చేసుకోవడం సహజం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని వేదికల్లోనూ ఇది కనిపిస్తుంది. అయితే స్థానిక సంప్రదాయాలను గౌరవిస్తూ ఆయా దేశాల్లో షాంపేన్‌ను దూరంగా ఉంచాలని ఇటీవల నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియాలో తొలిసారి తాజా సీజన్‌లో ఎఫ్–1 జరిగినప్పుడు, గత ఏడాది ఇండోనేసియా ఫార్ములా ‘ఇ’ జరిగినప్పుడు కూడా రంగు రంగుల కాగితాలు వెదజల్లడంతోనే వేడుకలు జరుపుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దీనినే హైదరాబాద్‌లోనూ అనుసరించబోతున్నారు. ఇక్కడా షాంపేన్‌తో సంబరాలు లేకుండా మెషీన్ల ద్వారా రంగురంగుల కాగితాలను వెదజల్లుతారు.
ప్రాక్టీస్‌లో ప్రమాదం...
శుక్రవారం తొలి ఫ్రీ ప్రాక్టీస్ సందర్భంగా సర్క్యూట్‌పై అనుకోని ఘటన చోటు చేసుకుంది. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ‘పోర్‡్ష’ జట్టు డ్రైవర్ పాస్కల్ వెర్లీన్ కారు అదుపు తప్పింది. 18వ మలుపు వద్ద ఎడమవైపు గోడను ఢీకొని కారు నిలిచిపోయింది. అయితే అదృష్టవశాత్తూ పాస్కల్ ఎలాంటి ప్రమాదం లేకుండా క్షేమంగా బయటపడ్డాడు. ప్రస్తుతం పాయింట్లలో అతను అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ట్రాక్‌పై తమకు ఎలాంటి ఫిర్యాదులు లేవని, స్ట్రీట్ సర్క్యూట్ ఇలా కాస్త ఎక్కువ దుమ్ముతో ఉండటం సహజమేనని నిర్వాహకులు వెల్లడించారు. మరోవైపు ట్రాక్‌పైకి అనూహ్యంగా పబ్లిక్ వాహనాలు దూసుకురావడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ట్రాఫిక్‌ను నిలువరిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని దాటి ఒక బైకర్ ముందుకు వెళ్లడం, మిగతా వారంతా అతడిని అనుసరించినట్లుగా తెలిసింది. వెంటనే అప్రమత్తమైన నిర్వాహక బృందం పరిస్థితిని చక్కదిద్దింది. దాంతో ప్రాక్టీస్ రేస్ అర గంట ఆలస్యంగా ప్రారంభమైంది.
Hyderabad E-Prix 2023 : రేసింగ్ @ హైదరాబాద్
Published Sat, Feb 11 2023 5:27 AM | Last Updated on Sat, Feb 11 2023 9:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment