
వీవీఎస్ లక్ష్మణ్-రాహుల్ ద్రవిడ్(ఫైల్‌ఫోటో)
ఏమి చేయాలో తెలియక ప్రతీది యత్నించాం. వారి గురించి ఆలోచన పక్కకు పెట్టడానికి నా ఫేవరెట్ సాంగ్‌లు కూడా పాడా.
సౌతాంప్టన్: దాదాపు 19 ఏళ్ల నాటి ఈడెన్ గార్డెన్ టెస్టు మ్యాచ్‌ను ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌ల ఊచకోతకు తాము ఎంతలా గురయ్యామో వివరించాడు. ఆ మ్యాచ్ తమ చేతుల్లో ఉందనే భావిస్తే, దాన్ని ద్రవిడ్, లక్ష్మణ్‌లు తమ బ్యాటింగ్‌తో వారి చేతుల్లోకి తీసుకుపోవడం ఇప్పటికీ ఒక కలగానే ఉందన్నాడు. వారిద్దరి దెబ్బకు అంతర్జాతీయ క్రికెట్‌లో అప్పటికే నాలుగు వేల ఓవర్లు పూర్తి చేసిన తనకు మతిభ్రమించిందన్నాడు. సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్-పాకిస్తాన్‌ల జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు సందర్భంగా వార్న్.. 2001 కోల్‌కతా టెస్టును నెమరువేసుకున్నాడు. (చదవండి: ఫ్రీబాల్‌కు పట్టుబడుతున్న అశ్విన్!)
‘నాకు బాగా గుర్తు. నేను స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నా. ద్రవిడ్, లక్ష్మణ్‌ల దాటికి చేసేది లేక నా పక్కనే ఉన్న ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో మూవీస్ గురించి చర్చించడం మొదలుపెట్టా. మేము క్యాప్‌లు కూడా మార్చుకున్నాం. ఏమి చేయాలో తెలియక ప్రతీది యత్నించాం. వారి గురించి ఆలోచన పక్కకు పెట్టడానికి నా ఫేవరెట్ సాంగ్‌లు కూడా పాడా. మొత్తంగా మాకు ఒక మతిభ్రమించినట్లు చేశారు ద్రవిడ్, లక్ష్మణ్‌లు. వారు చాలా అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడారు. నేను ఆడుతున్న సమయంలో వారిద్దరూ ఆడిన ఇన‍్నింగ్స్ ఎప్పటికీ చిరస్మరణీయమే. ఇక్కడ లక్ష్మణ్ ఇన్నింగ్స్ చాలా స్పెషల్. ద్రవిడ్ కూడా అసాధారణ ఆటను కనబరిచాడు. కొన్నిసార్లు మీరు దేవుడనే చెప్పాలి’ అని వార్న్ తెలిపాడు.
ఆసీస్‌తో జరిగిన ఆ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్మణ్ 281 పరుగుల సాధిస్తే, ద్రవిడ్ 180 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి 376 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్సి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేయగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ ఫాలో ఆన్ ఆడింది. భారత్ ఫాలో ఆన్ ఆడుతూనే ద్రవిడ్-లక్ష్మణ్‌ల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆసీస్‌కు సవాల్ విసిరింది. భారత్ నిర్దేశించిన 384 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ 212 పరుగులకే ఆలౌటైంది. దాంతో భారత్ 171 పరుగుల తేడాతో విజయం చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ ఇన్నింగ్స్ తేడాతో గెలుస్తుందనుకుంటే లక్ష్మణ్-ద్రవిడ్‌ల దెబ్బకు ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. (చదవండి: ‘తప్పు చేశాం.. వరల్డ్‌కప్ చేజార్చుకున్నాం’)