పోర్ట్ ఎలిజబెత్: మూడేళ్ల క్రితం వరుణ్ చక్రవర్తి ‘మిస్టరీ స్పిన్నర్’గా గుర్తింపు తెచ్చుకొని భారత జట్టులోకి ఎంపికయ్యాడు. శ్రీలంకతో టి20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో పొదుపైన బౌలింగ్ ప్రదర్శన కనబర్చడంతో కొద్ది రోజులకే యూఏఈలో జరిగిన టి20 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం కూడా దక్కింది.
అయితే 3 మ్యాచ్‌లలో కలిపి 11 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు! దాంతో అతను తీవ్ర విమర్శలపాలై సెలక్టర్ల నమ్మకం కోల్పోయాడు. జట్టులో స్థానం చేజార్చుకున్న అతను ఐపీఎల్‌లో మాత్రం ఆకట్టుకున్నాడు. 2024 ఐపీఎల్‌లో మళ్లీ సత్తా చాటి కోల్‌కతా నైట్‌రైడర్స్ టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించడంతో ఎట్టకేలకు మళ్లీ టీమిండియా చాన్స్ లభించింది.
పునరాగమంలో ఆడిన 5 టి20ల్లో కలిపి 13 వికెట్లతో వరుణ్ సత్తా చాటాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో రెండో టి20 మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన అతను తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘వైఫల్యాలు వచ్చిన తర్వాత నేను మళ్లీ నా ఆటలో మూలాలకు వెళ్లిపోయాను. నా వీడియోలు చూసి లోపాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేశా. నా సైడ్ స్పిన్ బౌలింగ్ అంతర్జాతీయ స్థాయిలో పనికి రాదని అర్థమైంది.
అందుకే నా బౌలింగ్‌లో సమూల మార్పులు చేసుకున్నాను. దానికి రెండేళ్లు పట్టింది. ఐపీఎల్‌తో పాటు స్థానిక లీగ్‌లలో అది మంచి ఫలితాలు ఇవ్వడంతో దానినే ఇక్కడా కొనసాగించాను. ఆదివారం మ్యాచ్‌లో నా శైలికి పిచ్ కూడా సహకరించింది. ఇకపై కూడా ఇలాగే రాణించాలని కోరుకుంటున్నా’ అని వరుణ్ స్పందించాడు.
మూడేళ్ల క్రితం భారత జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత తన పరిస్థితి బాగా ఇబ్బందికరంగా మారిందని అతను గుర్తు చేసుకున్నాడు. దానిని కష్టకాలంగా అతను పేర్కొన్నాడు. ‘గత మూడేళ్లు చాలా కఠినంగా సాగాయి. ఆపై మరింత ఎక్కువ క్రికెట్ ఆడటమే నేను చేయగలిగిందని అర్థమైంది.
అందుకే టీఎన్‌పీఎల్ వంటి దేశవాళీ లీగ్‌లలో పాల్గొన్నా. అది నా ఆటను మరింత అర్థం చేసుకునేందుకు, ఆపై మెరుగు పర్చుకునేందుకు ఉపకరించింది’ అని వరుణ్ చెప్పాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడిన సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన బాధ్యతలపై స్పష్టత ఇవ్వడం మేలు చేసిందని అతను అన్నాడు. ‘నువ్వు 30–40 పరుగులు ఇచ్చినా సరే ఆందోళన చెందవద్దు. వికెట్ల తీయడమే నీ పని అంటూ నా బాధ్యత ఏమిటో గంభీర్ స్పష్టంగా చెప్పారు. అది మంచి చేసింది’ అని ఈ స్పిన్నర్ వ్యాఖ్యానించాడు.
చదవండి: ICC CT 2025: టీమిండియా లేకుంటే చాంపియన్స్ ట్రోఫీ లేనట్లే!
Comments
Please login to add a commentAdd a comment