స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 4-1 తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కోహ్లి, మహ్మద్ షమీ, రాహుల్ వంటి స్టార్ క్రికెటర్లు లేకుండానే ఇంగ్లండ్‌ను రోహిత్ సారథ్యంలోని యంగ్ ఇండియా చిత్తు చేసింది. కాగా ఈ టెస్టు సిరీస్‌తో నలుగురు యువ క్రికెటర్లు భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశారు.
అందులో ఒకడు ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. భారత జట్టులో చోటు కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న సర్ఫరాజ్‌కు రాజ్‌కోట్ టెస్టు ముందు సెలక్టర్లు పిలుపునిచ్చారు. కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కావడంతో సర్ఫరాజ్‌కు భారత జట్టులో చోటు దక్కింది. జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ రాజ్‌కోట్ టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. దీంతో భారత జట్టు ప్రాతినిథ్యం వహించాలన్న అతడి కల నేరవేరింది.
కాగా ఇది సర్ఫరాజ్ ఒక్కడి కల మాత్రమే కాదు తన తండ్రి నౌషాద్ ఖాన్‌ది కూడా. సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్ కూడా క్రికెటరే. అతడు భారత జట్టు తరపున ఆడాలని కలలు కన్నాడు. కానీ అతడి కలను తన కొడుకు రూపంలో నేరవేర్చుకున్నాడు. సర్ఫరాజ్ టెస్టు క్యాప్‌ను అందుకునే సమయంలో నౌషాద్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
నౌషాద్ ఖాన్ చిన్న కొడుకు ముషీర్ ఖాన్ కూడా దేశీవాళీ క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. ఇక తాజాగా రోహిత్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా "టీమ్ రో" మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన కుర్రాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు.
"యువ క్రికెటర్లతో కలిసి ఆడటాన్ని ఎంజాయ్ చేశాను. వారంతా చాలా అల్లరి చేసే వారు. నాకు వారిలో చాలా మంది తెలుసు. వారి బలాలు ఏంటో, వాళ్లు ఎలా ఆడాలనుకుంటారో తెలుసు. వారికి అంతర్జాతీయ స్ధాయిలో అనుభవం లేకపోయినప్పటికి దేశీవాళీ క్రికెట్‌లో ఎలా ఆడారో నాకు తెలుసు. కాబట్టి వారి గత ఇన్నింగ్స్‌లను గుర్తు చేస్తూ ఆత్మవిశ్వాసం నింపడమే నా పని.
కుర్రాళ్లు కూడా నా నమ్మకాన్ని వమ్ముచేయలేదు. అద్బుతంగా రాణించారు. అరంగేట్రంలోనే అదరగొట్టారు. వారి డెబ్యూ సమయంలో తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. వారు ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను.
సర్ఫరాజ్ కుటంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను నా చిన్నతనంలో కంగా లీగ్‌లో సర్ఫరాజ్ ఖాన్ తండ్రితో కలిసి ఆడాను. అతని తండ్రి ఎడమచేతి బ్యాటర్. ఆయన దూకుడుగా ఉండేవాడు. సర్ఫరాజ్ భారత్‌కు ప్రాతినిథ్యం వహించడం వెనక అతడి తండ్రి కృషి ఎంతో ఉందని" హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment