
మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించారు. కోహ్లిపై తనకు ఎంతో గౌరవం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంగర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నా జీవితంలో నేను చూసిన బెస్ట్ క్రికెటర్ విరాట్ కోహ్లి. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు, అతడి ఎనర్జీ, ఆట పట్ల మక్కువ.. ఫీల్డింగ్ చేసే విధానం ఇవన్నీ. అతడిపై గౌరవం కలగడానికి తాజాగా తీసుకున్న ఆ నిర్ణయం( అనుష్క డెలివరీ సమయానికి ఇండియాకి వెళ్లాలనుకోవటం) కూడా కారణం. మనలాగే అతడు కూడా ఓ సాధారణ మనిషి. ( కృనాల్ పాండ్యా నిర్బంధం )
నేనెవరికైనా సలహా ఇవ్వాలనుకుంటే.. మీ పిల్లల పుట్టుకను మిస్ చేసుకోకండని కచ్చితంగా చెబుతాను. ఎందుకంటే అది మన జీవితంలో ఎంతో గొప్పది’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, కోహ్లి భార్య అనుష్క శర్మ జనవరి నెలలో మొదటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 21న ముగియనున్న అడిలైడ్ ఓపెనింగ్ టెస్ట్ తర్వాత ఆస్ట్రేలియానుంచి కోహ్లి ఇంటి ముఖం పట్టనున్నాడు. ఒక వేళ ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చినట్లయితే 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుంది. దీంతో చివరి మూడు టెస్టులకు అతడు దూరం అయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment