దుబాయ్: జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కోచ్ హీత్ స్ట్రీక్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. అవినీతి నిరోధక నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు స్ట్రీక్‌పై ఈ నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ ప్రకటించారు. ఈ నిషేధ సమయంలో స్ట్రీక్ ఏ రకమైన క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. 47 ఏళ్ల హీత్ స్ట్రీక్ జింబాబ్వే తరఫున 65 టెస్టుల్లో, 189 వన్డేల్లో బరిలోకి దిగాడు. టెస్టుల్లో 216 వికెట్లు తీసిన అతను 1,990 పరుగులు చేశాడు. వన్డేల్లో 239 వికెట్లు పడగొట్టిన స్ట్రీక్ 2,943 పరుగులు సాధించాడు. ‘హీత్ స్ట్రీక్ ఎంతో అనుభవమున్న అంతర్జాతీయ మాజీ క్రికెటర్, జాతీయ జట్టు కోచ్. క్రికెట్‌లో అవినీతిని నిరోధించడం కోసం నిర్వహించిన ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో అతను పాల్గొన్నాడు.
ఈ నిబంధనల ప్రకారం ఎంత బాధ్యతగా మెలగాలో కూడా అతనికి అవగాహన ఉంది. కానీ అతను ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించాడు. 2016– 2018 మధ్యకాలంలో స్ట్రీక్ జింబాబ్వే జాతీయ జట్టుకు, వివిధ టి20 లీగ్‌లలో పలు జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. 2018లో జింబాబ్వే, బంగ్లాదేశ్, శ్రీలంక పాల్గొన్న ముక్కోణపు సిరీస్‌లో... 2018లో జింబాబ్వే–అఫ్గానిస్తాన్ సిరీస్‌లో... 2018 ఐపీఎల్‌లో... 2018 అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్‌లకు సంబంధించి అంతర్గత సమాచారాన్ని బుకీలకు చేరవేశాడు. ఆటగాళ్లను బుకీలకు పరిచయం చేసేందుకు ప్రయత్నించాడు. స్ట్రీక్ అంతర్గత సమాచారంతో ఆయా మ్యాచ్‌ల తుది ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపలేదు’ అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. 2018 ఐపీఎల్‌లో స్ట్రీక్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. 2029 మార్చి 28వ తేదీతో స్ట్రీక్‌పై ఎనిమిదేళ్ల నిషేధం ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment