టీమిండియాకు అవమానం జరిగింది. 2024 ఐసీసీ పురుషుల వన్డే జట్టులో ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. టీమిండియా గతేడాది వన్డే ఫార్మాట్‌లో అతి తక్కువ మ్యాచ్‌లు ఆడటమే ఇందుకు కారణం.
2024లో టీమిండియా కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడింది. ఇందులో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.
2024 మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌ను ఐసీసీ ఇవాళ (జనవరి 24) ప్రకటించింది. ఈ జట్టులో నలుగురు శ్రీలంక ప్లేయర్లు.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి చెరి ముగ్గురు.. వెస్టిండీస్‌కు చెందిన ఓ ఆటగాడు చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు సారధిగా లంక కెప్టెన్ చరిత్ అసలంక ఎంపికయ్యాడు. గతేడాది ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గానూ రాణించినందుకు ఐసీసీ అసలంకను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
అసలంక గతేడాది 16 వన్డేల్లో 50.2 సగటున 605 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 4 అర్ద సెంచరీలు ఉన్నాయి. శ్రీలంక గతేడాది 18 వన్డేలు ఆడి 12 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఏ జట్టూ గతేడాది ఇన్ని వన్డేలు ఆడలేదు.
దాయాది పాక్ గతేడాది 9 వన్డేలు ఆడి ఏడింట విజయాలు సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ గతేడాది 14 వన్డేల్లో 8 మ్యాచ్‌ల్లో నెగ్గింది.
ఐసీసీ వన్డే జట్టులో ఏకైక నాన్ ఏషియన్ వెస్టిండీస్ ఆటగాడు షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్. 2023లో వన్డే అరంగేట్రం చేసిన రూథర్‌ఫోర్డ్ గతేడాది 9 మ్యాచ్‌లు ఆడి 106.2 సగటున 425 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగా రూథర్‌ఫోర్డ్‌కు ఐసీసీ జట్టులో చోటు దక్కింది.
ఐసీసీ జట్టులో భారత్‌తో పాటు SENA దేశాలైన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌కు కూడా ప్రాతినిథ్యం లభించలేదు.
రెండోసారి ఇలా..!
ఐసీసీ వన్డే జట్లను ప్రకటించడం మొదలుపెట్టినప్పటి నుంచి (2004) భారత్‌కు ప్రాతినిథ్యం లభించకపోవడం ఇది రెండో సారి మాత్రమే. 2021లో కూడా ఐసీసీ మెన్స్ వన్డే టీమ్‌లో భారత ఆటగాళ్లకు చోటు లభించలేదు.
2023లో జట్టు నిండా భారతీయులే..!
2023 ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌లో ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. టీమిండియా నుంచి రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ ఐసీసీ జట్టుకు ఎంపికయ్యారు.
ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: చరిత్ అసలంక (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, పథుమ్ నిస్సంక, కుసాల్ మెండిస్ (వికెట్‌కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, వనిందు హసరంగ, షాహీన్ షా అఫ్రిది, హరీస్ రౌఫ్, అల్లా ఘజన్‌ఫర్
Comments
Please login to add a commentAdd a comment