ICC player of the month nominations for October: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుల నామినీలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. అక్టోబరు నెలకు గానూ ఈ పురస్కారానికి తమ పరిశీలనలో ఉన్న క్రికెటర్ల పేర్లను గురువారం వెల్లడించింది. పురుషుల విభాగంలో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, పాకిస్తాన్ పవర్ హిట్టర్ ఆసిఫ్ అలీ, నమీబియా బ్యాటర్ డేవిడ్ వీజ్ ఈ జాబితాలో చోటుదక్కించుకున్నారు. అయితే, టీ20 వరల్డ్‌కప్ ఆరంభంలో దారుణంగా విఫలమైన నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లలో ఒక్కరి పేరు కూడా ఈ లిస్టులో లేకపోవడం గమనార్హం.
ఇక మహిళల విభాగంలో ఐర్లాండ్ ఆల్‌రౌండర్ లారా డెలాని, బ్యాటర్ గాబీ లూయీస్, జింబాబ్వే కెప్టెన్ మేరీ అన్నే ముసొండ పేర్లు ఈ లిస్టులో ఉన్నాయి. కాగా అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్ల విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు ఐసీసీ ఈ ఏడాది ఆరంభంలో సరికొత్త పురస్కారాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అత్యుత్తమంగా రాణించిన క్రికెటర్లను ప్రతి నెలా సత్కరించనుంది.
షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan)..
టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్... అక్టోబరులో ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో మొత్తంగా 131 పరుగులు చేయడం సహా.. 11 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో రెండోసారి ఈ పురస్కారానికి నామినేట్ అయ్యాడు.
ఆసిఫ్ అలీ(పాకిస్తాన్- Asif Ali)
పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాటర్ ఆసిఫ్ అలీ టీ20 ప్రపంచకప్-2021లో ఇప్పటి వరకు 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 52 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కేవలం 12 బంతుల్లో 27 పరుగులు సాధించాడు. అంతేగాక అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో 19వ ఓవర్‌లో 4 సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు.
డేవిడ్ వీజ్(నమీబియా- David Wiese)
ఈ ఏడాది(2021) తొలిసారిగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆడేందుకు అర్హత సాధించింది నమీబియా. అద్బుత ప్రదర్శనతో సంచలన విజయాలు సాధించి సూపర్- 12 రౌండ్‌కు దూసుకెళ్లింది. ఇక నమీబియా వెటరన్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీజ్ విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. ఆడిన 8 మ్యాచ్‌లలో 162 పరుగులు చేయడం సహా... ఏడు వికెట్లు తీశాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 66 పరుగులతో అజేయంగా నిలిచి సూపర్-12కు తమ జట్టు దూసుకువెళ్లేలా చేశాడు.
లారా డెలాని(Laura Delany)
ఐర్లాండ్ ఆల్‌రౌండర్ లారా డెలాని అక్టోబరులో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి 189 పరుగులు సాధించింది. 4 వికెట్లు కూడా తీసింది. సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించింది.
గాబీ లూయీస్(Gaby Lewis)
ఐర్లాండ్ బ్యాటర్ గాబీ లూయీస్ జింబాబ్వే సిరీస్‌లో 263 పరుగులు సాధించింది. వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచింది. 3-1 తేడాతో ఐర్లాండ్ సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించింది.
మేరీ- అన్నే ముసొండ(Mary-Anne Musonda)
జింబాబ్వే కెప్టెన్ మేరీ- అన్నే ముసొండ ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌లో మెరుగ్గా రాణించింది. 4 మ్యాచ్‌లలో మొత్తంగా 169 పరుగులు సాధించింది. ఐర్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో చారిత్రక విజయం సాధించడంలో సెంచరీతో మెరిసి.. అజేయంగా నిలిచి.. తన సత్తా చాటింది.
చదవండి: Rohit Sharma: రాత్రికి రాత్రే చెత్త ఆటగాళ్లం అయిపోము కదా.. ఇప్పుడు..
Comments
Please login to add a commentAdd a comment