టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వకపోవడమే మంచిదైందని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని భావించగా.. అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ను భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ప్రకటించారు. ఫిట్‌నెస్ సమస్యల నేపథ్యంలోనే హార్దిక్‌ను కాదని, సూర్యకు పగ్గాలు ఇచ్చినట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.
ఈ విషయంపై భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప స్పందించాడు. తాను గనుక హార్దిక్ పాండ్యా స్థానంలో ఉంటే.. ఈపాటికి సంతోషంతో ఎగిరి గంతేసేవాడినని పేర్కొన్నాడు. కెరీర్ పొడిగించుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదని అభిప్రాయపడ్డాడు.
‘‘నేను హార్దిక్ పాండ్యా స్థానంలో ఉంటే.. నా గురించి మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారని సంతోషించేవాడిని. ఎందుకంటే.. భారత క్రికెట్ ఎకోసిస్టమ్‌లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అత్యంత అరుదుగా లభించే ఆటగాడు.
ఒకవేళ నాకు 34- 35 ఏళ్ల వయసు ఉండి.. తరచూ గాయాల బారిన పడుతూ ఉంటే కెరీర్ ప్రమాదంలో పడుతుంది. అదే ముందు నుంచీ జాగ్రత్తగా ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. మరికొంత కాలం ఆటలో కొనసాగవచ్చు.
జాతీయ జట్టుకు సేవలు అందించవచ్చు. కాబట్టి కెప్టెన్సీకి దూరంగా ఉండమన్నా ఆనందంగా సరేనంటాను’’ అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు. ఈ మేరకు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
కాగా జూలై 27 నుంచి టీమిండియా- శ్రీలంక మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. ఈ పర్యటనలో టీమిండియా కొత్త కోచ్‌గా గౌతం గంభీర్ ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో అడుగుపెట్టింది. ఇరు జట్ల మధ్య మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment