వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు వ్యవహరించిన తీరుపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విమర్శలు సంధించాడు. దేశవాళీ క్రికెట్‌లో గత మూడేళ్లుగా అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లకు చోటు ఇవ్వకపోవడం దారుణమన్నాడు. సాకులు చెప్పి తప్పించుకోవడం సరికాదని, అవకాశం ఇస్తేనే కదా ఎవరేంటో తెలిసేదంటూ ఫైర్ అయ్యాడు.
తాజా సైకిల్‌లో తొలి సిరీస్
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత రోహిత్ సేన వెస్టిండీస్ పర్యటనలో బిజీ కానుంది. జూలై 12న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో ఈ టూర్ ఆరంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25లో టీమిండియాకు ఇదే తొలి సిరీస్. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీసీసీఐ టెస్టు జట్టును ప్రకటించింది.
వాళ్లిద్దరికీ మొండిచేయి
రోహిత్ శర్మ కెప్టెన్‌గా, అతడి డిప్యూటీగా అజింక్య రహానే వ్యవహరించనుండగా.. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషన్‌లకు కూడా జట్టులో చోటు లభించింది. ఇక మూడేళ్ల తర్వాత పేసర్ నవదీప్ సైనీ కూడా పునరాగమనం చేసే అవకాశం వచ్చింది.
అయితే, గత కొన్నేళ్లుగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అదరగొడుతున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం మరోసారి మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో సెలక్టర్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సర్ఫరాజ్‌లో క్రమశిక్షణ లోపించిందని, అతడు పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేడంటూ బీసీసీఐ వర్గాలు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.
యశస్వి ఓకే.. కానీ వాళ్లేం పాపం చేశారు?
ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. సర్ఫరాజ్‌కు మద్దతుగా నిలిచాడు. అతడికి కనీసం ఒక్క అవకాశమైనా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు.. ‘‘రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీలో యశస్వి జైశ్వాల్ టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు.
అతడిని జట్టులోకి తీసుకోవడం బాగుంది. అయితే, నేను సర్ఫరాజ్ విషయంలో బాధపడుతున్నా. గత మూడేళ్లుగా అతడు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. కానీ ఒక్క అవకాశం కూడా రావడం లేదు.
కనీసం ఒక్క ఛాన్స్
అదే విధంగా అభిమన్యు ఈశ్వరన్ విషయంలో కూడా ఇలాగే జరగుతోంది. ఐదారేళ్లుగా అతడు రాణిస్తున్నాడు.అయినా నో ఛాన్స్. వీళ్లిద్దరి విషయంలో సెలక్టర్ల తీరు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
ఫాస్ట్ బౌలింగ్‌లో సరిగ్గా ఆడలేడన్న కారణంతో సర్ఫరాజ్‌ను ఎలా పక్కనపెడతారు? అతడు పేసర్లను ఎదుర్కోలేడని మీకెవరు చెప్పారు? నాకు తెలిసినంత వరకు సర్ఫరాజ్‌కు పేసర్ల బౌలింగ్‌లో ఆడేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒక్క అవకాశం ఇవ్వండి. తనను తాను నిరూపించుకుంటాడు’’అని గంగూలీ సెలక్టర్ల తీరును తూర్పారబట్టాడు.
వెస్టిండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ.
చదవండి: ఆర్నెళ్లుగా జట్టుకు దూరం.. ఏకంగా టీమిండియా కెప్టెన్‌గా రీఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment