రోహిత్ శర్మ- స్టీవ్ స్మిత్ (ఫైల్ ఫొటో)
Ind Vs Aus 2023 T20 Series- Vizag: తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు శుభవార్త. వైజాగ్‌లో మరో అంతర్జాతీయ మ్యాచ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి రంగం సిద్ధం చేసింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత్‌లోనే గడుపనున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన అనంతరం పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా- ఆసీస్ తలపడనున్నాయి.
వైజాగ్‌లో తొలి మ్యాచ్
ఇందులో భాగంగా వైజాగ్ వేదికగా నవంబరు 23న భారత్- ఆస్ట్రేలియాల మధ్య తొలి టీ20 జరుగనుంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్ ఏసీఏ, వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ గోపీనాథ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున, సిటీ పోలీస్ కమిషనర్ సీపీ రవి శంకర్ అయ్యనర్, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
ఈసారి ఐపీఎల్ తరహాలో
ఈ సందర్భంగా.. ఏసీఏ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది లో జరగబోయేది మూడో మ్యాచ్ ఇది. గత మ్యాచ్‌లలో చోటు చేసుకున్న లోటుబాట్లు ఏమైనా ఉంటే వాటిపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నాం. అన్ని రాష్ట్రాల అధ్యక్షులను, కార్యదర్శులకు ఆహ్వానం ఇస్తాము.
మన స్టేడియం కెపాసిటి 27 వేలు. ఇక విశాఖలో బీచ్‌రోడ్డులో 10 వేల మంది వీక్షించేందుకు ఐపీఎల్ తరహా ఫ్యాన్ పార్క్స్, బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాం. ఇక మ్యాచ్‌కు సంబంధించిన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లలో టికెట్స్ అందుబాటులో ఉంటాయి’’ అని తెలిపారు.
అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ.. ‘‘టీమిండియా- ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ నిర్వహణకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్లేయర్స్ కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తున్నాం... ఈ ఇంటర్నేషనల్ మ్యాచ్‌పై అందరి అంచనాలు అందుకునేలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని తెలియజేశారు.
పూర్తి భద్రత నడుమ
అదే విధంగా.. సీపీ రవి శంకర్ అయ్యనర్ సైతం.. ‘‘మ్యాచ్ డేన పార్కింగ్, ట్రాఫిక్‌లపై పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది. అభిమానులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి భద్రత నడుమ నిర్వహిస్తాం.
ఆరోజు 2 వేల మంది వరకు విధుల్లో పాల్గొంటాం’’ అని మ్యాచ్ నిర్వహణ సజావుగా సాగేలా పోలీస్ శాఖ సంసిద్ధత గురించి తెలిపారు. కాగా ఈ టీ20 సిరీస్ నవంబరు 23న వైజాగ్‌లో మొదలై.. డిసెంబరు 3 నాటి హైదరాబాద్ మ్యాచ్‌తో ముగుస్తుంది.
చదవండి: మెకానికల్ ఇంజనీర్! పాక్‌ను ఒంటిచేత్తో ఓడించి.. టీమిండియా పరువు కాపాడి
Comments
Please login to add a commentAdd a comment