
రిషభ్ పంత్ అర్ధ శతకం (PC: BCCI X)
టీమిండియా తరఫున ‘రీ ఎంట్రీ’లో రిషభ్ పంత్ దుమ్ములేపాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత బ్లూ జెర్సీ ధరించిన పంత్ పొట్టి ఫార్మాట్లో దుమ్ములేపాడు. టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 32 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 53 పరుగులు సాధించాడు. అర్ధ శతకంతో మెరిసి రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు.
కాగా న్యూయార్క్ వేదికగా నసావూ కౌంటీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సంజూ శాంసన్ ఓపెనింగ్ చేశాడు.
రోహిత్ 19 బంతుల్లో 23 పరుగులు చేసి నిష్క్రమించగా.. సంజూ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రిషభ్ పంత్ 53 పరుగులతో రాణించగా.. మిగతా వాళ్లలో సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 31 పరుగులతో ఆకట్టుకున్నాడు.
ఇక శివం దూబే మాత్రం 16 బంతులు ఎదుర్కొని కేవలం 14 పరుగులే చేసి నిరాశపరిచాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా మాత్రం 23 బంతుల్లో 40 పరుగులతో దుమ్ములేపాడు. రవీంద్ర జడేజా(4)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.
ఈ క్రమంలో 20 ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం, మెహదీ హసన్, మహ్మదుల్లా, తన్వీర్ ఇస్లాం ఒక్కో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment