![IND VS ENG 3rd ODI: Virat Kohli Gets Dismissed By Adil Rashid For 11th Time, England Star Equals Terrific Record](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/adil.jpg.webp?itok=zDA_n0hx)
ప్రపంచ క్రికెట్‌ను శాశించే విరాట్ కోహ్లిని (Virat Kohli) కొందరు బౌలర్లు తెగ ఇబ్బంది పెట్టారు. విరాట్‌ను అతిగా ఇబ్బంది పెట్టిన బౌలర్ల జాబితాలోకి తాజాగా ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ (Adil Rashid) చేరాడు. భారత్‌తో నిన్న (ఫిబ్రవరి 12) జరిగిన మూడో వన్డేలో ఆదిల్ రషీద్ విరాట్‌ను ఔట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో విరాట్‌ను ఔట్ చేయడం ఆదిల్‌కు ఇది 11వ సారి.
ప్రపంచ క్రికెట్‌లో టిమ్ సౌథీ, జోష్ హాజిల్‌వుడ్ మాత్రమే విరాట్‌ను ఇన్ని సార్లు ఔట్ చేశారు. తాజా డిస్మిసల్‌తో ఆదిల్.. సౌథీ, హాజిల్‌వుడ్ సరసన చేరాడు. సౌథీ 37 మ్యాచ్‌ల్లో, హాజిల్‌వుడ్ 29 మ్యాచ్‌ల్లో, రషీద్ 34 మ్యాచ్‌ల్లో తలో 11 సార్లు విరాట్‌ను ఔట్ చేశారు. వీరి తర్వాత విరాట్‌ను అధికంగా ఇబ్బంది పెట్టింది మొయిన్ అలీ (41 మ్యాచ్‌ల్లో), జేమ్స్ ఆండర్సన్ (37 మ్యాచ్‌ల్లో). వీరిద్దరూ విరాట్‌ను చెరి 10 సార్లు ఔట్ చేశారు. వీరిద్దరు కూడా ఇంగ్లండ్ బౌలర్లే కావడం విశేషం.
బౌలర్లకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేసే విరాట్.. పై ఐదుగురంటే తెగ బయపడిపోతాడు. వీరి బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఆపసోపాలు పడతాడు. నిన్నటి మ్యాచ్‌లో ఈ సీన్ రిపీట్ అయ్యింది. ఆదిల్‌ను ఎదుర్కొనేందుకు విరాట్ చాలా కష్టపడ్డాడు. ఒకానొక సందర్భంలో ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
మథ్యలో ఆదిల్ శాంతించడంతో ఎలాగోలా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్.. ఆతర్వాత ఆదిల్ చేతికే చిక్కాడు. ఆదిల్ అద్భుతమైన ఫ్లైటెడ్ డెలివరీతో విరాట్ ఆట కట్టించాడు. బాగా టర్న్ అయిన ఈ బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్‌కీపర్ ఫిల్ సాల్ట్ చేతుల్లోకి వెళ్లింది. ఆదిల్ విరాట్‌ను వన్డేల్లో ఐదు సార్లు, టెస్ట్‌ల్లో నాలుగు సార్లు, టీ20ల్లో రెండు సార్లు ఔట్ చేశాడు.
కాగా, నిన్నటి మ్యాచ్‌లో విరాట్ హాఫ్ సెంచరీతో రాణించాడు. చాలా ఇన్నింగ్స్‌ల తర్వాత విరాట్ చేసిన హాఫ్ సెంచరీ ఇది. దీంతో వన్డేల్లో విరాట్ హాఫ్ సెంచరీల సంఖ్య 73కు చేరింది. ఈ మ్యాచ్‌లో విరాట్ హాఫ్ సెంచరీతో రాణించగా.. శుభ్‌మన్ గిల్ సెంచరీతో, శ్రేయస్ హాఫ్ సెంచరీతో మెరిశాడు.
వీరితో పాటు కేఎల్ రాహుల్ కూడా రాణించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 356 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 214 పరుగులకే ఆలౌటై 142 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు భారత్ ఇంగ్లండ్‌ను ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 4-1 తేడాతో ఓడించింది.
Comments
Please login to add a commentAdd a comment