India Vs England Live Score Third Test Match - Sakshi
Sakshi News home page

IND Vs ENG 3rd Test Day 1: వికెట్‌ నష్టపోకుండా టీమిండియా స్కోర్‌ను దాటేసిన ఇంగ్లండ్‌

Published Wed, Aug 25 2021 3:17 PM | Last Updated on Thu, Aug 26 2021 4:45 PM

IND Vs ENG 3rd Test Day 1: Live Score And Updates - Sakshi

వికెట్‌ నష్టపోకుండా టీమిండియా స్కోర్‌ను దాటేసిన ఇంగ్లండ్‌
బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. బౌలింగ్‌లో కూడా అదే ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే చేతులెత్తేసిన భారత్‌.. 31 ఓవర్ల అనంతరం ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయింది. ఇంగ్లండ్‌ ఓపెనర్ల సమయోచితమైన బ్యాటింగ్‌ ముందు భారత బౌలర్లు తేలిపోయారు. రోరి బర్న్స్(38), హసీబ్‌ హమీద్‌(32) భారత బౌలర్లకు చిక్కకుండా చుక్కలు చూపిస్తూ వికెట్‌ నష్టపోకుండా ఆధిక్యంలోకి దూసుకెళ్లారు.  

ఇంగ్లండ్‌ పేసర్ల విశ్వరూపం.. 78 పరుగులకే చాప చుట్టేసిన టీమిండియా
కొందరు ఆటగాళ్ల అత్యుత్సాహం మరోసారి టీమిండియా కొంపముంచింది. రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లను రెచ్చగొట్టినందుకు భారత్‌ తగిన మూల్యమే చెల్లించుకుంది. మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో కసిగా బౌలింగ్‌ చేయడంతో భారత బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేసారు. భారత ఆటగాళ్లు పోటీ పడి మరీ పెవిలియన్‌కు కూ​ కట్టడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే చాపచుట్టేసింది. ఓవర్టన్‌ బౌలింగ్‌లో సిరాజ్(3) ఔట్‌ కావడంతో భారత ఇన్నింగ్స్‌ సమాప్తమైంది. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్‌(19), రహానే(18) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆండర్సన్‌, ఓవర్టన్‌ తలో మూడు వికెట్లు పడగొట్టగా, రాబిన్సన్‌, సామ్‌ కర్రన్‌ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. 

ఇంగ్లండ్‌ పేసర్ల విశ్వరూపం.. 73 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన భారత్‌
తొలుత ఆండర్సన్‌(3), రాబిన్సన్‌(2).. ఆ తర్వాత ఓవర్టన్‌(2), సామ్‌ కర్రన్‌(2)లు టీమిండియా భరతం పట్టారు. ఈ నలుగురు ఇంగ్లండ్‌ పేసర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో టీమిండియా ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 58 పరగులకే సగం వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రెయిగ్‌ ఓవర్టన్‌.. వరుస బంతుల్లో రోహిత్‌ శర్మ(19), షమీ(0)లను ఔట్‌ చేసి టీమిండియా ఇన్నింగ్స్‌ సమాప్తికి ముహూర్తం ఖరారు చేయగా, ఆ తరువాతి ఓవర్‌లో సామ్‌ కర్రన్‌ కూడా వరుస బంతుల్లో జడేజా(4), బుమ్రా(0)లను ఎల్బీడబ్ల్యూ చేసి భారత ఇన్నింగ్స్‌ ను దాదాపుగా సమాప్తం చేశాడు. ఓవర్టన్‌, కర్రన్‌ ద్వయం ఆరు బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టి.. టీమిండియా ఆశలను సమాధి చేశారు. క్రీజ్‌లో ఇషాంత్‌ శర్మ, సిరాజ్‌ ఉన్నారు.

58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా..పంత్‌(2) ఔట్‌
ఇంగ్లండ్‌ పేసర్ల ధాటికి టీమిండియా ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. తొలుత ఆండర్సన్‌ త్వరతగతిన మూడు వికెట్లు పడగొట్టి భారత బ్యాట్స్‌మెన్ల భరతం పట్టగా, తాజాగా రాబిన్సన్‌ టీమిండియా ప్లేయర్స్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. లంచ్‌ విరామానికి ముందు రహానేను బోల్తా కొట్టించిన రాబిన్సన్‌.. లంచ్‌ తర్వాత పంత్‌(2) పనిపట్టాడు. మొదటి నాలుగు వికెట్ల తరహాలోనే పంత్‌ కూడా వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇంగ్లండ్‌ వికెట్‌కీపర్‌ జోస్‌ బట్లర్‌ ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. ఇన్నింగ్స్‌ తొలి 5 వికెట్లలో భాగస్వామి(క్యాచ్‌ లేదా స్టంపింగ్‌) అయిన రెండో వికెట్‌కీపర్‌గా ఆసీస్‌ మాజీ వికెట్‌కీపర్‌ బ్రాడ్‌ హడిన్‌ సరసన నిలిచాడు. హడిన్‌ 2014-15 గబ్బా టెస్ట్‌లో టీమిండియాపై ఈ ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌ పేసర్ల ధాటికి టీమిండియా 58 పరగులకు సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజ్‌లో రోహిత్‌(15), జడేజా(0) ఉన్నారు.  

నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. రహానే(18) ఔట్‌
లంచ్‌ విరామానికి ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. నిలకడగా బ్యాటింగ్‌ చేస్తున్నట్లు కనిపించిన రహానే(18; 3 ఫోర్లు)ను ఒలీ రాబిన్సన్‌ బోల్తా కొట్టించాడు. మొదటి మూడు వికెట్ల తరహాలోనే రహానే కూడా వికెట్‌ కీపర్‌ బట్లర్‌కే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. లంచ్‌ విరామం సమాయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 52 పరుగులు సాధించి ఎదురీదుతోంది. రోహిత్‌ శర్మ(15; ఫోర్‌) పట్టుదలగా ఆడుతున్నాడు.  

నిప్పులు చెరుగుతున్న ఆండర్సన్‌.. కోహ్లి వికెట్‌ కూడా అతని ఖాతాలోకే
ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ ఆండర్సన్‌ ధాటికి టీమిండియా బెంబేలెత్తిపోతుంది. బుల్లెట్‌ వేగంతో దూసుకొచ్చే బంతుల ధాటిని తట్టుకోలేక టీమిండియా బ్యాట్స్‌మెన్లు ఒక్కొక్కరుగా చేతులెత్తేస్తున్నారు. తొలి ఐదు ఓవర్లలోనే కేఎల్‌ రాహుల్‌(0), పుజారా(1)లను పెవిలియన్‌కు పంపిన ఆండర్సన్‌.. 11వ ఓవర్‌లో టీమిండియా కెప్టెన్‌ కోహ్లి(7)కి కూడా షాకిచ్చాడు. విశేషమేమిటంటే వీరి ముగ్గరిని ఆండర్సన్‌ ఒకే తరహాలో ఔట్‌ చేశాడు. వీరంతా వికెట్‌కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగారు. 11 ఓవర్ల తర్వాత టీమిండియా 3 వికెట్ల నష్టానికి 21 పరుగులు మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. క్రీజ్‌లో రోహిత్‌(4), రహానే ఉన్నారు. 

నిప్పులు చెరుగుతున్న ఆండర్సన్‌.. 4 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
రెండో టెస్ట్‌లో ఎదురైన పరాభవానికి ఇంగ్లండ్‌ బౌలర్‌ ఆండర్సన్‌ ప్రతీకారం తీర్చుకుంటున్నట్లున్నాడు. తొలి ఓవర్లోనే కేఎల్‌ రాహుల్‌ను పెవిలియన్‌కు పంపి టీమిండియాకు షాకిచ్చిన ఆండర్సన్‌.. మరో మూడు ఓవర్లు తిరక్కుండానే పుజారా(1)ను సైతం పెవిలియన్‌కు పంపి భారత్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. రాహుల్‌ తరహాలోనే పుజారా కూడా వికెట్‌కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చే ఔటయ్యాడు. ఆండర్సన్‌.. నిప్పులు చెరిగే బంతులను సంధిస్తూ.. టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. 10 ఓవర్ల తర్వాత టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 19 పరగులు చేసింది. రోహిత్(4), కోహ్లి(7) ఆచితూచి ఆడుతున్నారు. 

తొలి ఓవర్‌లోనే టీమిండియాకు షాక్‌.. కేఎల్‌ రాహుల్‌ డకౌట్‌
టీమిండియాకు టాస్‌ గెలిచిన ఆనందం ఎంతో సేపు నిలువలేదు. తొలి ఓవర్‌లోనే భారత్‌కు గట్టి షాక్‌ తగిలింది. రెండో టెస్ట్‌ శతకవీరుడు కేఎల్‌ రాహుల్‌ను ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ ఆండర్సన్‌ పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్‌ ఐదో బంతికే వికెట్‌కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి రాహుల్‌(0) వెనుదిరిగాడు. దీంతో  టీమిండియా 1 పరుగుకే తొలి వికెట్‌ కోల్పోయింది. రోహిత్‌కు జతగా క్రీజ్‌లోకి పుజారా వచ్చాడు. 

లీడ్స్‌: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండో టెస్ట్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగగా, ఇంగ్లండ్‌ జట్టు రెండు మార్పులు చేసింది. ఓపెనర్‌ సిబ్లే స్థానంలో డేవిడ్‌ మలాన్‌ జట్టులోకి రాగా, గాయపడిన మార్క్‌ వుడ్‌ ప్లేస్‌లో క్రెయిగ్‌ ఒవర్టన్‌ బరిలో నిలిచాడు. ఈ టెస్ట్‌లో టీమిండియా సైతం ఓ మార్పుతో బరిలోకి దిగుతుందని భావించినప్పటికీ కోహ్లి మాత్రం లార్డ్స్‌ టెస్ట్‌లో ఆడిన జట్టుపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

తొలి రెండు టెస్ట్‌ల్లో అంతగా ప్రభావం చూపని రవీంద్ర జడేజాను పక్కకు పెట్టి అశ్విన్‌ను ఆడిస్తారని విశ్లేషకులు సైతం అంచనా వేశారు. అయితే, కోహ్లి.. జడేజాపై నమ్మకం ఉంచడంతో అశ్విన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే, రెండో టెస్ట్‌లో టీమిండియా చిరస్మరణీయ విజయం సాధించడంతో 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్‌ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌, ఇషాంత్ శర్మ.
ఇంగ్లండ్: రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిరిస్టో, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), మొయిన్ అలీ, సామ్ కరన్, ఓలీ రాబిన్సన్, క్రెయిగ్ ఒవర్టన్, జేమ్స్ అండర్సన్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement