లీడ్స్: టీమిండియాతో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొని విమర్శల పాలైన ఇంగ్లండ్ జట్టు.. తమ తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నట్లు తెలుస్తోంది. మూడో టెస్ట్‌కు ముందు మీడియాతో వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఆ జట్టు సారధి జో రూట్ మాటల్లో అది స్పష్టమైంది. లీడ్స్ టెస్ట్‌లో తమ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై రూట్ మాట్లాడుతూ.. లార్డ్స్ టెస్ట్ తమకు మంచి గుణపాఠం నేర్పిందని, ఇకపై ఇతర విషయాల జోలికి వెళ్లకుండా ఆటపై మాత్రమే దృష్టి సారిస్తామని అన్నాడు.
స్లెడ్జింగ్‌కు కానీ వ్యక్తిగత విమర్శల జోలికి కానీ వెళ్లకుండా తమ సహజసిద్ధమైన ఆటను నిజాయితీగా ఆడతామని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా విఫలమైయ్యాడని తనపై వస్తున్న విమర్శలపై రూట్ స్పందిస్తూ.. సందర్భానుసారంగా తగిన నిర్ణయాలు తీసుకోవడంలో తాను విఫలమయ్యానని, కెప్టెన్సీ విషయంలో తాన ఇంకా మెరుగుపడాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. రెండో టెస్ట్ ఓటమి నుంచి ఇప్పటికే తేరుకున్నామని, తదుపరి మ్యాచ్‌ల్లో తప్పక పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. ఇక మూడో టెస్ట్‌లో మూడు కీలక మార్పులతో బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేశాడు.
డామ్ సిబ్లీ స్థానంలో డేవిడ్ మలాన్, గాయపడిన మార్క్ వుడ్ స్థానంలో సకిబ్ మహమూద్ జట్టులోకి వస్తారని వెల్లడించాడు. మూడో మార్పుపై ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. కాగా, టీమిండియాతో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 151 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. డ్రా చేసుకునే మ్యాచ్‌ను ఇంగ్లండ్ చేజేతులారా పోగొట్టుకుంది. ఇంగ్లీష్ ప్లేయర్లు పంతాలకు పోయి మూల్యం చెల్లించుకున్నారు. ఫలితంగా 5 టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది.
చదవండి: ధోనీ, రైనా వీర బాదుడు.. సంబరాల్లో సీఎస్‌కే ఫ్యాన్స్
Comments
Please login to add a commentAdd a comment