ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ తరఫున టీ20ల్లో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) తర్వాత ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఓ భారీ రికార్డు సాధించింది.
పవర్ ప్లేల్లో (తొలి 6 ఓవర్లలో) తమ అత్యధిక స్కోర్ నమోదు చేసింది. అభిషేక్ విధ్వంసం ధాటికి భారత్ తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు పవర్ ప్లేల్లో టీమిండియా అత్యధిక స్కోర్ 82/2గా ఉండింది. 2021లో స్కాట్లాండ్‌పై భారత్ ఈ స్కోర్ చేసింది.
టీ20 పవర్ ప్లేల్లో భారత్ అత్యధిక స్కోర్లు
95/1 ఇంగ్లండ్‌పై (2025)
82/2 స్కాట్లాండ్‌పై (2021)
82/1 బంగ్లాదేశ్‌పై (2024)
78/2 సౌతాఫ్రికాపై (2018)
కాగా, ఈ మ్యాచ్‌లో అభిషేక్ విధ్వంసం హాఫ్ సెంచరీతో ఆగలేదు. హాఫ్ సెంచరీ తర్వాత అతను మరింత చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా సూర్యకుమార్ యాదవ్ (2) క్రీజ్‌లో ఉన్నాడు. 10 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 143/2గా ఉంది. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ 7 బంతుల్లో 16, తిలక్ వర్మ 15 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యారు. తిలక్ కాస్త పర్వాలేదనిపించగా.. శాంసన్ వరుసగా ఐదో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు.
37 బంతుల్లో శతక్కొట్టిన అభిషేక్
హాఫ్ సెంచరీ తర్వాత పేట్రేగిపోయిన అభిషేక్ శర్మ 37 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఇది రెండో వేగవంతమైన శతకం. టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ 2017లో శ్రీలంకపై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఓవరాల్‌గా టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. గతేడాది చౌహాన్ సైప్రస్‌పై కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 194/5. అభిషేక్ (108), రింకూ సింగ్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment