
నాటింగ్‌హమ్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ టీమిండియాపై తన అక్కసును వెల్లగక్కడం ఆపడం లేదు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా డ్రా ముగిసిన నేపథ్యంలో.. తనకు మాత్రమే చేతనైన వెటకారపు ట్వీట్‌ను చేశాడు. కోహ్లీ సేనను రక్షించేందుకే వర్షం కురిస్తుందంటూ వ్యంగ్యమైన ట్వీట్‌ను సంధించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత అభిమానులు వాన్‌పై ధ్వజమెత్తుతున్నారు. ఆఖరి రోజు ఆటలో 98 ఓవర్లకు ఆస్కారముండగా టీమిండియా చేతిలో 9 వికెట్లు మిగిలున్నాయి. ఇంత పటిష్ట స్థితిలో భారత జట్టు ఉంటే.. వాన్ ఇలాంటి చెత్త ట్వీట్లు చేయడమేంటని భారతీయులు మండిపడుతున్నారు.
Looks like Rain may be saving Indian here … 😜 #ENGvIND
— Michael Vaughan (@MichaelVaughan) August 8, 2021
ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌పై తొలి టెస్ట్ నెగ్గి శుభారంభం చేయాల్సిన టీమిండియాకు వరుణుడు అడ్డు తగిలాడు. 209 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు నాలుగో రోజు ఆఖరి సెషన్‌లో బరిలోకి దిగిన భారత్.. కేఎల్ రాహుల్ (38 బంతుల్లో 26; 6 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయి 52 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (12 బ్యాటింగ్), పుజారా (12 బ్యాటింగ్) క్రీజులో నిలిచారు. ఆఖరి రోజు మరో 157 పరుగులు చేస్తే భారత్ విజయ జయభేరి మోగించేదే. ఇలాంటి తరుణంలో వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో అంపైర్లు ఆఖరి రోజు ఆటను రద్దు చేస్తూ.. మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.
అంతకుముందు 25/0 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (172 బంతుల్లో 109; 14 ఫోర్లు) సెంచరీ సాధించాడు. టీమిండియా బౌలర్లు బుమ్రా (5/64), శార్ధూల్ ఠాకూర్(2/37), సిరాజ్(2/84), షమీ(1/72) రాణించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment