Vaughan
-
కోవిడ్ బూచి చూపించి టీమిండియా డ్రామాలాడింది.. అంతా ఐపీఎల్ కోసమే..!
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన చివరి టెస్ట్ కోవిడ్ కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఉద్దేశపూర్వకంగానే మ్యాచ్ రద్దుకు మొగ్గుచూపిందంటూ ఇంగ్లీష్ మీడియా విషప్రచారం చేస్తోంది. దీనికి ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా తోడై టీమిండియా, బీసీసీఐలపై బురదజల్లుతున్నారు. కరోనా బూచిని చూపించి టీమిండియా డ్రామాలాడిందని, ఈ తతంగమంతా ఐపీఎల్ కోసమేనని రకరకాలు కథనాలు ప్రచారం చేస్తుంది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో రెండుసార్లు నెగిటివ్ వచ్చినా కోహ్లి సేన మ్యాచ్ ఆడేందుకు ససేమిరా అనడం, ఆపై మాంచెస్టర్ వీధుల్లో చక్కర్లు కొట్టడం, ఆ వెంటనే ఐపీఎల్ కోసం ప్రత్యేక విమానాల్లో దుబాయ్‌కు బయల్దేరడంపై ఆ దేశ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కస్సుబుస్సులాడుతున్నాడు. కాసులు కురిపించే క్యాష్ రిచ్ లీగ్‌లో ఒక్క మ్యాచ్‌కు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకే భారత క్రికెటర్లు చివరి టెస్ట్ నుంచి తప్పుకున్నారని, వారికి దేశం తరఫున ఆడే టెస్ట్ మ్యాచ్ కంటే ఐపీఎల్ మ్యాచ్‌లంటేనే ముఖ్యమని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కోవిడ్ టెస్ట్ 'నెగెటివ్' రిపోర్టు వచ్చాకే యూఏఈ బయల్దేరిన కోహ్లి అండ్ కో అదే రిపోర్టుతో ఒక రోజు ఆలస్యంగా టెస్ట్ ఆడితే ఏమయ్యేదంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ కాకుండా చివరకు 'డబ్బు' గెలిచిందని ఘాటుగా విమర్శించారు. టీమిండియా ఆటగాళ్లలో కరోనా సోకుతుందేమోనన్న భయం కంటే ఐపీఎల్‌కు దూరమవుతామనే ఆందోళన ఎక్కువైందని, అందువల్లే మాంచెస్టర్ టెస్ట్ రద్దయిందని నోరుపారేసుకున్నాడు. మరోవైపు వాన్.. టీమిండియా ఆటగాళ్లపై చేస్తున్న నిరాధారమైన ఆరోపణలకు ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సైతం ఘాటుగానే బదులిచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టు నలభై రోజులు ఖాళీగా కూర్చుంది. ఆ సమయంలో టెస్ట్ సిరీస్‌ను కాస్త ముందుగా జరపమన్నా వినలేదు. పైగా పనికిమాలిన ‘హండ్రెడ్' లీగ్ కోసం రెండు, మూడో టెస్ట్‌ల మధ్య 9 రోజుల విరామం ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఐపీఎల్‌ను విమర్శించడంలో అర్థం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సౌతాఫ్రికా పర్యటనలో ఇంగ్లండ్ జట్టు చేసిందేంటని ప్రశ్నించాడు. ఇంగ్లండ్ జట్టులో కరోనా కేసులు లేకున్నా.. ఎందుకు ఆ సిరీస్ బాయ్‌కట్ చేసిందని నిలదీశాడు. చదవండి: ఆవేశంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు.. ఐపీఎల్ బహిష్కరిస్తామని బెదిరింపులు..! -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు: కోహ్లీ సేనపై మైఖేల్ వాన్ వెటకారం
నాటింగ్హమ్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ టీమిండియాపై తన అక్కసును వెల్లగక్కడం ఆపడం లేదు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా డ్రా ముగిసిన నేపథ్యంలో.. తనకు మాత్రమే చేతనైన వెటకారపు ట్వీట్‌ను చేశాడు. కోహ్లీ సేనను రక్షించేందుకే వర్షం కురిస్తుందంటూ వ్యంగ్యమైన ట్వీట్‌ను సంధించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత అభిమానులు వాన్‌పై ధ్వజమెత్తుతున్నారు. ఆఖరి రోజు ఆటలో 98 ఓవర్లకు ఆస్కారముండగా టీమిండియా చేతిలో 9 వికెట్లు మిగిలున్నాయి. ఇంత పటిష్ట స్థితిలో భారత జట్టు ఉంటే.. వాన్ ఇలాంటి చెత్త ట్వీట్లు చేయడమేంటని భారతీయులు మండిపడుతున్నారు. Looks like Rain may be saving Indian here … 😜 #ENGvIND — Michael Vaughan (@MichaelVaughan) August 8, 2021 ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌పై తొలి టెస్ట్ నెగ్గి శుభారంభం చేయాల్సిన టీమిండియాకు వరుణుడు అడ్డు తగిలాడు. 209 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు నాలుగో రోజు ఆఖరి సెషన్లో బరిలోకి దిగిన భారత్.. కేఎల్ రాహుల్ (38 బంతుల్లో 26; 6 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయి 52 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (12 బ్యాటింగ్), పుజారా (12 బ్యాటింగ్) క్రీజులో నిలిచారు. ఆఖరి రోజు మరో 157 పరుగులు చేస్తే భారత్ విజయ జయభేరి మోగించేదే. ఇలాంటి తరుణంలో వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో అంపైర్లు ఆఖరి రోజు ఆటను రద్దు చేస్తూ.. మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. అంతకుముందు 25/0 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (172 బంతుల్లో 109; 14 ఫోర్లు) సెంచరీ సాధించాడు. టీమిండియా బౌలర్లు బుమ్రా (5/64), శార్ధూల్ ఠాకూర్(2/37), సిరాజ్(2/84), షమీ(1/72) రాణించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. -
WTC Final: కివీస్ ఈ పాటికే గెలవాల్సింది..
సౌథాంప్టన్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ టీమిండియాపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. అవకాశం దొరికినప్పుడల్లా టీమిండియాను తక్కువ చేస్తూ మాట్లాడే వాన్.. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌ను ఉద్దేశించి కోహ్లీ సేనపై ట్విటర్ వేదికగా విషం చిమ్మాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లండ్‌లో కాకుండా మరో చోట జరిగి ఉంటే, ఈ పాటికే న్యూజిలాండ్ విజేతగా నిలిచేదని ట్వీట్ చేశాడు. వాన్.. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారేమీ కాదు. భారత ఆస్ట్రేలియా పర్యటన నుంచి తాజా డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు అవకాశం దొరికినప్పుడల్లా భారత్‌ను టార్గె్ట్ చేస్తూ వస్తున్నాడు. అయితే, ఈసారి అభిమానులు కూడా తమదైన శైలిలో వాన్‌కు చురకలంటించారు. If this #worldtestchampionshipfinal been played up north they wouldn’t have missed a minutes play … #Justsaying #INDvsNZ !! NZ would have been champions by now … 😜 — Michael Vaughan (@MichaelVaughan) June 22, 2021 ఇంగ్లండ్ జట్టులా భారత్ అడ్డదారిలో ప్రపంచకప్ గెలవలేదని రివర్స్ కౌంటరిచ్చారు. అంపైర్ తప్పుడు నిర్ణయాలు, బౌండరీ కౌంట్ వంటి అడ్డదారులతో ఇంగ్లండ్ 2019 వన్డే ప్రపంచకప్ గెలిచిందని గుర్తు చేస్తున్నారు. విలువ తక్కువ పనులు, క్రీడా స్పూర్తి దెబ్బతీసేలా భారత జట్టు ఎప్పుడూ వ్యవహరించలేదని, నలుగురు తలెత్తుకునేలా ఆడిందని ఫైరయ్యారు. భారత జట్టు విజయాలను వాన్ ఏ మాత్రం ఓర్వలేకపోతున్నాడని, అసలు భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ రావడమే అతనికి ఇష్టం లేదని కామెంట్ చేస్తున్నారు. కాగా, గతంలో భారత్, ఇంగ్లండ్ సిరీస్ సందర్భంగా కూడా వాన్ ఇలానే పేలాడు. స్పిన్ పిచ్‌లు రెడీ చేశారని గగ్గోలు పెట్టాడు. pic.twitter.com/Pn29A9wJsU — Dev Patel (@dev_patel19) June 22, 2021 . pic.twitter.com/JtYXvuQ0E0 — Aayush Arora (Night Owl) (@VIRAT_X_ABD) June 22, 2021 ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. ఊహించినట్లుగానే మ్యాచ్ ఆరో రోజుకు(రిజర్వ్ డే) చేరింది. 32 పరుగుల ఆధిక్యంతో ఆఖరి రోజు ఆటను కొనసాగించిన భారత్.. ఆరంభంలోనే మూడు కీలకమైన వికెట్లు(కోహ్లీ, పుజారా, రహానే) కోల్పోయినప్పటికీ.. పంత్(34), జడేజా(13) జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. లంచ్ విరామం తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 142 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం టీమిండియా 110 పరుగుల ఆధిక్యంలో ఉంది. కివీస్ బౌలర్లు సౌథీ, జేమీసన్ తలో రెండు వికెట్లు, బౌల్ట్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. చదవండి: ICC Rankings: టాప్ ర్యాంక్‌కు దూసుకెళ్లిన జడేజా -
సెంచరీ చేయలేకపోయినా నీలా మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రం చేయలేదు..
లండన్: పాకిస్థాన్ మాజీ ఆటగాడు సల్మాన్ బట్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మధ్య మాటల యుద్దం చినికి చినికి గాలివానలా మారుతుంది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారత్‌లో పుట్టుంటే కోహ్లికి మించిన ప్రజాదరణ లభించేదని, అతను కోహ్లిని వెనక్కు నెట్టి ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా చలామణి అయ్యేవాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వాన్‌కు సల్మాన్ బట్ చురకలంటించాడు. వన్డేల్లో కనీసం ఒక్క సెంచరీ కూడా చేయని వాన్‌కు.. అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు చేసిన కోహ్లి గురించి మాట్లాడే అర్హత లేదంటు ఘాటుగా విమర్శించాడు. అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఆటతీరును కనబర్చే కోహ్లిని ఇతరులతో పోల్చడం అర్దరహితమన్నాడు. ఈ నేపథ్యంలో సల్మాన్ బట్ వ్యాఖ్యలపై వాన్ కూడా ఘాటుగానే స్పందించాడు. సెంచరీ చేయలేకపోయినా నీలా మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రం చేయలేదంటూ ట్విటర్ వేదికగా ధ్వజమెత్తాడు. ఈ వ్యాఖ్యలకు సల్మాన్ బట్ కూడా ధీటుగా బదులిచ్చాడు. వాన్ మానసిక సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఘాటుగా విమర్శించాడు. ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్ల గురించి అనవసర చర్చను లేవనెత్తినందుకు తాను స్పందించానని, దానికి అతను పాత విషయాలను తవ్వడం ఏమాత్రం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా, 2010లో మ్యాచ్ ఫిక్సింగ్వివాదంలో చిక్కుకున్న బట్.. పదేళ్ల నిషేదానికి గురైన సంగతి తెలిసిందే. చదవండి: కోహ్లి అత్యుత్తమ ఆటగాడు.. మాట మార్చిన ఆసీస్ కెప్టెన్ -
కోహ్లి 70 సెంచరీలు చేశాడు.. మరి నువ్వు.?
ఇస్లామాబాద్: అనవసర కామెంట్లు చేస్తూ, అర్ధం పర్ధం లేని చర్చలను లేవనెత్తుతూ ఇటీవల కాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌పై పాక్ మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ సల్మాన్ బట్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. కొద్ది రోజుల కిందట టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని న్యూజిలాండ్ సారధి కేన్ విలియమ్సన్తో పోలుస్తూ వాన్ తెరలేపిన చర్చపై బట్ మండిపడ్డాడు. విలియమ్సన్ భారత్‌లో జన్మించి ఉంటే కోహ్లిని వెనక్కు నెట్టి ప్రపంచపు అత్యుత్తమ క్రికెటర్‌గా నిలిచేవాడని వాన్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని పేర్కొన్నాడు. వన్డే ఫార్మాట్లో ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేని వాన్ అర్ధరహితమైన చర్చలకు తెరలేపుతూ తన స్థాయిని దిగజార్చుకుంటున్నాడంటూ చురకలంటించాడు. 86 వన్డేల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి ఒక్క శతకం కూడా నమోదు చేయలేని ఆటగాడు చర్చల్లో పాల్గొనేందుకు అనర్హుడని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 70 శతకాలు నమోదు చేసి అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్, పాంటింగ్ తర్వాత మూడో స్థానంలో నిలిచిన కోహ్లిని ప్రస్తుత తరం క్రికెటర్లతో పోల్చడాన్ని ఆయన తప్పుబట్టాడు. ఇంగ్లండ్ కెప్టెన్‌గా మంచి ట్రాక్ రికార్డు కలిగిన వాన్.. కోహ్లిలా గొప్ప క్రికెటర్ మాత్రం కాదని, అలాంటి వ్యక్తికి ఆల్ టైమ్ గ్రేట్ బ్యాట్స్మెన్లలో ఒకరైన కోహ్లి గురించి మాట్లాడే అర్హత లేదని ఘాటుగా విమర్శించాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో కోహ్లికి మించిన ఆటగాడు లేడని, ఇందుకు అతని గణాంకాలే నిదర్శనమన్నాడు. రికార్డుల పరంగా చూసినా కోహ్లి ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడని, అలాంటప్పుడు అతన్ని సమకాలీకులతో పోల్చడం సమంజసం కాదని అభిప్రాయడ్డాడు. కాగా, వన్డే ఫార్మాట్లో ఒక్క సెంచరీ కూడా సాధించని వాన్.. టెస్టుల్లో మాత్రం 18 శతకాలు నమోదు చేశాడు. 1999 నుంచి 2007 మధ్యకాలంలో అతను 82 టెస్టుల్లో 5719 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో ఐదేళ్ల నిషేదానికి గురైన సల్మాన్ బట్.. పాక్ తరఫున 33 టెస్టులు, 78 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: 'ఆ నెంబర్ వాన్ మరిచిపోలేదు.. అందుకే స్పందించాడు' -
ముంబై ఇండియన్స్ కాకపోతే సన్‌రైజర్స్‌కే ఆ ఛాన్స్..
లండన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ ఎడిషన్ మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో టైటిల్ విజేత ఎవరనే అంశంపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తమతమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా ట్విటర్ వేదికగా తన అంచనాలను పంచుకున్నాడు. సీజన్ ప్రారంభానికి ముందే టైటిల్ గెలిచే జట్టేదో చెప్పేశాడు. వాన్ అంచనాల ప్రకారం.. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్సే ఈసారి కూడా టైటిల్ గెలిచి సిక్సర్ కొడుతుందని జోస్యం చెప్పాడు. ఏదో అద్భుతం జరిగితే తప్పా ఆ జట్టు వట్టి చేతులతో వెళ్లదన్నాడు. ముంబై కానీ పక్షంలో టైటిల్ గెలిచే అవకాశం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాత్రమే ఉందన్నాడు. Early #IPL2021 prediction ... @mipaltan will win it ... if by some bizarre loss of form then @SunRisers will win it ... #OnOn #India — Michael Vaughan (@MichaelVaughan) April 7, 2021 ఐపీఎల్ విజేతపై అంచనాలను ఆయన ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే, వాన్ ప్రిడిక్షన్‌పై మిగతా ఐపీఎల్ జట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ నువ్వే డిసైడ్ చేస్తే, ఇన్ని జట్లు ఆడటం ఎందుకని చురకలంటిస్తున్నారు. ఏప్రిల్ 9న ప్రారంభంకానున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. సన్‌రైజర్స్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 11న చెన్నై వేదికగా కోల్‌కతాతో ఆడనుంది. ముంబై, హైదరాబాద్ జట్లు ఫేస్ టు ఫేస్ మ్యాచ్‌లను ఏప్రిల్ 17న, మే 4న ఆడనున్నాయి. చదవండి: క్వారంటైన్ పూర్తయిన ఆనందంలో గేల్ ఏం చేశాడో తెలుసా.. -
ఆ సమయంలో నట్టూ గుండె ఎంత వేగంగా కొట్టుకుందో..
న్యూఢిల్లీ: చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మూడో వన్డేలో భారత్ ఇంగ్లండ్‌పై గ్రాండ్ విక్టరీ సాధించి, 2-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీమిండియా సాధించిన ఈ విజయానికి రిషబ్ పంత్ అద్భుత బ్యాటింగ్, శార్దూల్ ఠాకూర్ (4/67) బౌలింగ్ గణాంకాలే కారణమని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేసి, భారత్ శిబిరంలో ఆందోళన రేపిన ఇంగ్లండ్ నవయువ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్‌ను సైతం అందరూ కొనియాడుతున్నారు. అయితే, చివరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసిన టీమిండియా పేసర్ నటరాజన్‌ను మాత్రం ఎవ్వరూ గుర్తించడంలేదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. 6 బంతుల్లో 14 పరుగులు సాధించాల్సిన తరుణంలో అద్భుతమైన యార్కర్లను సంధించిన నట్టూపై ఆయన ప్రశంసల వర్షం కురిపించాడు. ఒత్తిడిలోనూ నటరాజన్ తన యార్కర్లతో మాయ చేశాడని, ఆఖరి ఓవర్ బౌల్ చేసే సమయంలో అతని గుండె ఎంత వేగంగా కొట్టుకుందో ఊహించడం కష్టమేనని పేర్కొన్నాడు. ఆఖరి ఓవర్లలో తక్కువ ఎత్తులో యార్కర్లు సంధించడం అద్భుతమైన కళ అని, అది నట్టూకు బాగానే ఉందని కొనియాడాడు. సరైన బంతులు విసిరి మ్యాచ్‌ను గెలిపించిన నటరాజన్‌ను ఎంత అభినందించినా తక్కువేనని వెల్లడించాడు. స్లాగ్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో ఏమాత్రం పొరపాటు జరిగినా బంతిని స్టాండ్స్‌లో వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వివరించాడు. తీవ్ర ఒత్తిడిలో అద్భుతమైన యార్కర్లు సంధించగల ఆటగాళ్లలో లసిత్ మలింగ, బ్రెట్‌లీలు ముందువరుసలో ఉంటారని పేర్కొన్నాడు. చదవండి: ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన శ్రీలంక ఆల్‌రౌండర్ -
అతనొక గొప్ప డ్రింక్ మిక్సర్ అయ్యిండొచ్చు
లండన్: టీమిండియాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-3 తేడాతో చేజార్చుకున్న ఇంగ్లండ్ జట్టుపై ముప్పేట దాడి మొదలైంది. జట్టు యాజమాన్యం అవలంభిస్తున్న రోటేషన్ పద్దతి కారణంగానే ఇంగ్లీష్ జట్టు సిరీస్‌ను కోల్పోవాల్సి వచ్చిందని ఆ జట్టు మాజీ ఆటగాళ్లు విమర్శలు ఎక్కుపెట్టారు. టీ20 స్పెషలిస్ట్ అయిన స్పిన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం కల్పించకపోవడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మండిపడ్డాడు. టీ20 సిరీస్‌కు ముందు జరిగిన టెస్టు సిరీస్‌లో మొయిన్ అలీ ఆడిన ఏకైక టెస్టులో(రెండో టెస్టు) ఆశాజనకమైన ప్రదర్శన(8 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో18 బంతుల్లో 43 పరుగులు) కనబర్చినప్పటికీ.. రోటేషన్ పద్దతి కారణంగా అతన్ని ఆఖరి రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరం పెట్టడంపై వాన్ ధ్వజమెత్తాడు. తిరిగి టీ20 సిరీస్ కోసం అతను జట్టులో చేరినప్పటికీ.. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వకుండా, కేవలం బెంచ్‌కే పరిమితం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొయిన్‌ను ఇంగ్లండ్ జట్టు మేనేజ్మెంట్.. డ్రింక్స్ సప్లయర్‌గా, ఎనర్జీ డ్రింక్స్ మిక్సర్ ఉపయోగించుకుందని ఆయన ధ్వజమెత్తాడు. మొయిన్ ఓ గొప్ప డ్రింక్ మిక్సర్ అయ్యిండొచ్చు .. అందుకే యాజమాన్యం అతనినలా ఉపయోగించుకొని ఉండవచ్చని వ్యంగ్యంగా స్పందించాడు. రోటేషన్ పద్దతి పేరుతో యాజమాన్యం ఆటగాళ్లతో ఈ విధంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికాడు. కాగా, సిరీస్ మొత్తంలో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లకు అవకాశం కల్పిస్తే, ఇంగ్లండ్ మాత్రం కేవలం ఆదిల్ రషీద్‌కే పదేపదే అవకాశం కల్సిస్తూ, మొయిన్అలీని విస్మరించిడంపై ఆయన మండిపడ్డాడు. -
అలాంటి పిచ్‌లపై గెలవడం గొప్పేమీ కాదు..
లండన్: ఇంగ్లీష్ జట్టుపై 3-1 తేడాతో గెలుపొందిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతుంటే.. ఇంగ్లండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ మాత్రం టీమిండియాపై తన అక్కసును వెల్లగక్కుతున్నాడు. స్పిన్నర్లకు స్వర్గధామమైన భారత దేశపు పిచ్‌లపై టీమిండియా విజయాలు సాధించడం పెద్ద గొప్ప విషయమేమీ కాదని పేర్కొన్నాడు. స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలించే ఇంగ్లండ్ గడ్డపై గెలిచినప్పుడే టీమిండియా అత్యుత్తమగా జట్టుగా నిలుస్తుందని వెల్లడించాడు. టీమిండియా విజయవరంపర ఇంగ్లండ్‌లోనూ కొనసాగితే.. ఈ శకంలోనే అత్యుత్తమ టెస్టు జట్టుగా నిలుస్తుందన్నాడు. స్వింగ్ బంతుల్ని ఎదుర్కొనేందుకు భారత ఆటగాళ్లు కష్టపడతారు కాబట్టే తాను ఈరకమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నానన్నాడు. టెస్టుల్లో టీమిండియా మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తున్నప్పటికీ.. ఆ జట్టుకు అధిక శాతం విజయాలు ఉప ఖండపు పిచ్‌లపైనే దక్కడం తన అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయన్నాడు. టెస్టు మ్యాచ్‌లు రెండు, మూడు రోజుల్లో పూర్తి కావడం సంప్రదాయ క్రికెట్‌కు ఏమాత్రం మంచిది కాదని అభిప్రాపడ్డాడు. మొటేరా వేదికగా శనివారం ముగిసిన ఆఖరి టెస్ట్‌లో కోహ్లీసేన ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించి, న్యూజిలాండ్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. జూన్‌లో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం వేదిక కానుంది. -
ఆ రికార్డును ఇద్దరూ మిస్సయ్యారు!
చెన్నై: దాదాపు పుష్కరకాలానికి పైగా ఉన్న ఒక అరుదైన రికార్డుకు ఇద్దరు ఇంగ్లండ్ క్రికెటర్లు అత్యంత చేరువగా వచ్చినా దాన్ని మాత్రం అందుకోలేకపోయారు. ఇంగ్లండ్ తరపున ఒక ఏడాది అత్యధిక పరుగులు రికార్డును నెలకొల్పే అవకాశాన్ని తొలుత జో రూట్ కోల్పోగా, ఆ తరువాత దాన్ని బెయిర్ స్టో కూడా మిస్సయ్యాడు. 2002లో ఇంగ్లండ్ జట్టు తరపున టెస్టుల్లో ఒక క్యాలెండర్ అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్(1481) పేరిట ఉంది. అదే ఆ జట్టు తరపున ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగుల రికార్డుగా ఉంది. అయితేఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జో రూట్ ఆ రికార్డుకు పది పరుగుల దూరంలో నిలిచిపోగా, బెయిర్ స్టో 12 పరుగుల దూరంలో ఆ మైలురాయిని చేరుకునే కోల్పోయాడు. 2016లో జో రూట్ మూడు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీ సాయంతో 1471 పరుగులు నమోదు చేయగా, బెయిర్ స్టో 3 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో 1469 పరుగులు నమోదు చేశాడు. దాంతో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆటగాళ్లలో రూట్, బెయిర్ స్టోలు వరుసగా రెండు,మూడు స్థానాల్లో నిలిచారు. ఈ మ్యాచ్ లో స్టో 49 పరుగులు చేసి అవుట్ కాగా,రూట్ 88 పరుగులు చేసి అవుటయ్యాడు. -
ఆ రికార్డును బెయిర్ స్టో అధిగమిస్తాడా?
ముంబై: మైకేల్ వాన్.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ సారథి. అతని సారథ్యంలో ఇంగ్లండ్ అనేక అద్భుత విజయాలను సాధించింది. ఇంగ్లండ్ జట్టుకు అతనొక సక్సెస్ఫుల్ కెప్టెన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతని 9 ఏళ్ల టెస్టు కెరీర్లో 82 మ్యాచ్‌లు ఆడిన వాన్..147 ఇన్నింగ్స్‌లో 18 సెంచరీలు, మరో 18 హాఫ్ సెంచరీలు సాధించాడు. తన టెస్టు కెరీర్లో 41.44 సగటుతో 5,719 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. అతని అత్యధిక వ్యక్తిగత టెస్టు స్కోరు 197. అయితే అతని 2002లో ఇంగ్లండ్ తరపున నమోదు చేసిన అత్యధిక పరుగులు రికార్డుకు మరో ఇంగ్లిష్ ఆటగాడు అత్యంత చేరువలో ఉన్నాడు. దాదాపు పుష్కరకాలానికి పైగా వాన్ పేరిట ఉన్న రికార్డు చెరిగిపోవడానికి అతి కొద్ది దూరంలోనే ఉంది. 2002లో వాన్ టెస్టుల్లో 1481 పరుగులను సాధించాడు. అప్పట్నుంచి ఇప్పటివరకూ అదే ఇంగ్లండ్ తరపున ఒక క్యాలెండర్ ఇయర్లో సాధించిన అత్యధిక పరుగుల రికార్డు. ఆ సమయంలో శ్రీలంక, భారత్‌లపై విశేషంగా రాణించి అత్యధిక పరుగుల రికార్డును సొంతం చేసుకున్నాడు. కాగా, ఇప్పడు ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెయిర్ స్టో ఆ రికార్డుకు అత్యంత చేరువగా ఉన్నాడు. భారత్ జరిగిన నాల్గో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బెయిర్ స్టో హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో ఈ ఏడాది 1420 పరుగులను సాధించి ఇంగ్లండ్ నుంచి ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇంకా వాన్ కు 61 పరుగుల దూరంలో ఉన్న బెయిర్ స్టో.. భారత్ తో జరిగే ఐదో టెస్టులో రాణిస్తే మాత్రం ఆ రికార్డును తన పేరిటి లిఖించుకునే అవకాశం ఉంది. ఈ పరుగులు చేసే క్రమంలో వాన్ 61.70 సగటును కల్గి ఉండగా, బెయిర్ స్టో 61.73 యావరేజ్‌ను నమోదు చేశాడు. అయితే వాన్ ఆ సంవత్సరంలో 6 సెంచరీలు సాధిస్తే, బెయిర్ స్టో మూడు శతకాలను సాధించాడు. అయితే బెయిర్ స్టో ఎనిమిది హాఫ్ సెంచరీలను ఈ ఏడాది సాధించడం విశేషం. ఇదిలా ఉంచితే గతేడాది మూడు సెంచరీలు,10 హాఫ్ సెంచరీలు చేసిన స్టార్ ఆటగాడు జో రూట్ కు కూడా ఆ రికార్డును అధిగమించలేకపోయాడు. 2015లో జో రూట్ 1385 పరుగులతో సరిపెట్టుకున్న జో రూట్ ఆ రికార్డుకు 96 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇప్పుడు వాన్ రికార్డను బెయిర్ స్టో సాధిస్తాడా?లేదా?అనేది తదుపరి మ్యాచ్‌లో తేలిపోనుంది.