ఆ రికార్డును బెయిర్ స్టో అధిగమిస్తాడా?
ముంబై: మైకేల్ వాన్.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ సారథి. అతని సారథ్యంలో ఇంగ్లండ్ అనేక అద్భుత విజయాలను సాధించింది. ఇంగ్లండ్ జట్టుకు అతనొక సక్సెస్ఫుల్ కెప్టెన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతని 9 ఏళ్ల టెస్టు కెరీర్లో 82 మ్యాచ్లు ఆడిన వాన్..147 ఇన్నింగ్స్లో 18 సెంచరీలు, మరో 18 హాఫ్ సెంచరీలు సాధించాడు. తన టెస్టు కెరీర్లో 41.44 సగటుతో 5,719 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. అతని అత్యధిక వ్యక్తిగత టెస్టు స్కోరు 197. అయితే అతని 2002లో ఇంగ్లండ్ తరపున నమోదు చేసిన అత్యధిక పరుగులు రికార్డుకు మరో ఇంగ్లిష్ ఆటగాడు అత్యంత చేరువలో ఉన్నాడు. దాదాపు పుష్కరకాలానికి పైగా వాన్ పేరిట ఉన్న రికార్డు చెరిగిపోవడానికి అతి కొద్ది దూరంలోనే ఉంది. 2002లో వాన్ టెస్టుల్లో 1481 పరుగులను సాధించాడు. అప్పట్నుంచి ఇప్పటివరకూ అదే ఇంగ్లండ్ తరపున ఒక క్యాలెండర్ ఇయర్లో సాధించిన అత్యధిక పరుగుల రికార్డు. ఆ సమయంలో శ్రీలంక, భారత్లపై విశేషంగా రాణించి అత్యధిక పరుగుల రికార్డును సొంతం చేసుకున్నాడు.
కాగా, ఇప్పడు ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెయిర్ స్టో ఆ రికార్డుకు అత్యంత చేరువగా ఉన్నాడు. భారత్ జరిగిన నాల్గో టెస్టు రెండో ఇన్నింగ్స్లో బెయిర్ స్టో హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో ఈ ఏడాది 1420 పరుగులను సాధించి ఇంగ్లండ్ నుంచి ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇంకా వాన్ కు 61 పరుగుల దూరంలో ఉన్న బెయిర్ స్టో.. భారత్ తో జరిగే ఐదో టెస్టులో రాణిస్తే మాత్రం ఆ రికార్డును తన పేరిటి లిఖించుకునే అవకాశం ఉంది. ఈ పరుగులు చేసే క్రమంలో వాన్ 61.70 సగటును కల్గి ఉండగా, బెయిర్ స్టో 61.73 యావరేజ్ను నమోదు చేశాడు. అయితే వాన్ ఆ సంవత్సరంలో 6 సెంచరీలు సాధిస్తే, బెయిర్ స్టో మూడు శతకాలను సాధించాడు. అయితే బెయిర్ స్టో ఎనిమిది హాఫ్ సెంచరీలను ఈ ఏడాది సాధించడం విశేషం. ఇదిలా ఉంచితే గతేడాది మూడు సెంచరీలు,10 హాఫ్ సెంచరీలు చేసిన స్టార్ ఆటగాడు జో రూట్ కు కూడా ఆ రికార్డును అధిగమించలేకపోయాడు. 2015లో జో రూట్ 1385 పరుగులతో సరిపెట్టుకున్న జో రూట్ ఆ రికార్డుకు 96 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇప్పుడు వాన్ రికార్డను బెయిర్ స్టో సాధిస్తాడా?లేదా?అనేది తదుపరి మ్యాచ్లో తేలిపోనుంది.