100వ టెస్టు ఆడనున్న అశ్విన్, బెయిర్‌స్టో
రేపటి నుంచి ధర్మశాలలో భారత్, ఇంగ్లండ్ ఐదో టెస్టు
ధర్మశాల: టి20ల మెరుపులతో సంప్రదాయ టెస్టు సిరీస్‌లే కుదించబడుతున్నాయి. 3, 5 టెస్టుల సిరీస్ నుంచి 2, 3 టెస్టుల సిరీస్ లేదంటే అనామక జట్లయితే మొక్కుబడిగా ఏకైక టెస్టుతో ఐదు రోజుల ఆటను కానిచ్చేస్తున్నారు. మరోవైపు ఆటగాళ్లు కూడా ధనాధన్ ఆట మాయలో అసలైన ఫార్మాట్‌కు మంగళం పాడి లీగ్, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లతోనే కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఒక క్రికెటర్ 100వ టెస్టు ఆడటం ఆ ఆటగాడికే కాదు... ఇప్పుడు టెస్టు ఫార్మాట్‌కే మైలురాయిగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. మరి ప్రత్యర్థి జట్ల నుంచి చెరొకరు 100వ టెస్టు ఆడటమైతే అనూహ్యం! ఆతిథ్య భారత్ నుంచి దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ బృందం నుంచి బెయిర్‌స్టోలకు రేపటి నుంచి ఇరు జట్ల మధ్య ధర్మశాలలో జరిగే ఐదో టెస్టు చిరస్మరణీయం కానుంది. ఈ ఇద్దరు 99 మ్యాచ్‌లాడి టెస్టు క్రికెట్‌కు అభి‘వంద’నం పలుకేందుకు సిద్ధమయ్యారు.
14వ భారత క్రికెటర్‌గా...
భారత క్రికెట్‌లోనే విజయవంతమైన సారథులుగా వెలుగొందిన అజహరుద్దీన్ (99), ధోని (90)లు కూడా 100 టెస్టులు ఆడలేకపోయారు. జహీర్ ఖాన్ (92) సైతం ‘వంద’ భాగ్యానికి నోచుకోలేకపోయాడు. కొందరికే సాధ్యమైన ఈ మైలురాయిని అందుకోవడానికి అశ్విన్ సిద్ధమయ్యాడు. ఇటీవలే 500 వికెట్ల క్లబ్‌లో చేరిన అశ్విన్ ... కుంబ్లే తర్వాత ఈ మైలురాయి అందుకున్న రెండో భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
2011లో వెస్టిండీస్‌పై ఢిల్లీ టెస్టులో అరంగేట్రం చేసిన అశ్విన్ 13 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించాడు. టెస్టుల్లో టీమిండియా ఘనవిజయాల్లో భాగమైన అశ్విన్ ... ధోని సారథ్యంలో తురుపుముక్కగా రాటుదేలాడు. 99 టెస్టులాడి 507 వికెట్లు పడగొట్టాడు. 35 సార్లు ఐదేసి వికెట్లు, 8 సార్లు 10 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పేశాడు. వందో టెస్టు ఆడుతున్న 14వ భారత ఆటగాడిగా అశ్విన్ ఘనత వహిస్తాడు.
17వ ఇంగ్లండ్ ప్లేయర్ బెయిర్‌స్టో
ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ జానీ బెయిర్‌స్టో గురించి మనవాళ్లకి, ప్రత్యేకించి హైదరాబాద్ వాసులకి బాగా తెలుసు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్‌గా వార్నర్‌తో కలిసి మెరిపించాడు. టెస్టుల్లో నిలకడైన బ్యాటర్. 2012లో వెస్టిండీస్‌తో అరంగేట్రం చేసిన బెయిర్‌స్టో 99 టెస్టుల్లో 36.42 సగటుతో 5974 పరుగులు చేశాడు.
ఇందులో 12 శతకాలు, 26 అర్ధ శతకాలున్నాయి. కీపర్‌గా 242 క్యాచ్‌ల్ని పట్టడంతో పాటు 14 స్టంపౌట్లు చేశాడు. వందోటెస్టు ఆడుతున్న స్టార్ వికెట్ కీపర్ ఈ ఘనతకెక్కనున్న 17వ ఇంగ్లండ్ క్రికెటర్. వన్డేల్లో వందో మ్యాచ్ కూడా ధర్మశాలలోనే ఆడిన బెయిర్‌స్టో ఇప్పుడు అక్కడే మరో 100కు సై అంటున్నాడు.
ఇది అతిపెద్ద సంబరం. ఎందుకంటే నా కెరీర్లో ఇది గమ్యాన్ని మించిన పయనం. ఎప్పటికీ ప్రత్యేకం. ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశాను. ఎంతో నేర్చుకున్నాను. 2012లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. నాలుగు టెస్టుల్లో 52.64 సగటుతో 14 వికెట్ల పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్నా. కెరీర్ ఆరంభంలోనే పనైపోయిందనుకున్న ప్రతీసారి నన్ను నేను మార్చుకుంటూ సరికొత్త బౌలింగ్ అస్త్రాలతో ఇక్కడిదాకా ప్రయాణించడం గొప్ప అనుభూతిని ఇస్తోంది. –అశ్విన్
ఇది నాకు భావోద్వేగానికి గురిచేసే మ్యాచ్. ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలనే అందరూ కలలు కంటారు. నేనైతే ఆ కలల్ని నిజం చేసుకొని కెరీర్‌లో వందో ఆటకు రెడీ కావడం చాలా గొప్పగా అనిపిస్తుంది. 8 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన నాకు నా తల్లే సర్వస్వం. అందుకే ఈ ఘనత ఆమెకే అంకితం. –బెయిర్‌స్టో
Comments
Please login to add a commentAdd a comment