ఇంగ్లండ్ ముందు 378 పరుగుల లక్ష్యం... ఒకదశలో స్కోరు 107/0... ఇంగ్లండ్‌దే పైచేయిగా అనిపించింది. ఇంతలో బుమ్రా బౌలింగ్, బ్యాటర్ల స్వయంకృతం కలిపి 2 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు... 109/3... భారత్‌కు పట్టు చిక్కినట్లే కనిపించింది. కానీ రూట్, బెయిర్‌స్టో అనూహ్యంగా ఎదురు దాడికి దిగారు. నాలుగో ఇన్నింగ్స్‌లో కూడా బ్యాటింగ్ ఇంత సులువా అన్నట్లుగా పరుగులు సాధిస్తూ దూసుకుపోయారు. వీరిద్దరి 150 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో ఇంగ్లండ్ జట్టు విజయంపై కన్నేసింది. చేతిలో 7 వికెట్లతో చివరి రోజు ఆ జట్టు మరో 119 పరుగులు చేస్తే చాలు... ఇలాంటి స్థితిలో చివరి రోజు భారత్ ఏదైనా అద్భుతం చేయగలదా...ప్రత్యర్థిని కుప్పకూల్చగలదా!
బర్మింగ్‌హామ్: భారత్‌తో ఐదో టెస్టులో ఇంగ్లండ్ గెలుపు బాటలో పయనిస్తోంది. 378 పరుగులను ఛేదించే క్రమంలో ఆ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 259 పరుగులు చేసింది. జో రూట్ (112 బంతుల్లో 76 బ్యాటింగ్; 9 ఫోర్లు), బెయిర్‌స్టో (87 బంతుల్లో 72 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 125/3తో ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌటైంది. పంత్ (86 బంతుల్లో 57; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు.
పంత్ అర్ధసెంచరీ...
నాలుగో రోజు ఆటను పుజారా (168 బంతుల్లో 66; 8 ఫోర్లు), పంత్ కొన్ని చక్కటి షాట్లతో ఆరంభించడంతో తొలి 7 ఓవర్లలో 27 పరుగులు వచ్చాయి. అయితే స్టువర్ట్ బ్రాడ్ తన తొలి ఓవర్లోనే పుజారాను అవుట్ చేసి 78 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెర దించాడు. భారత్ ఆధిక్యం 300 పరుగులు దాటిన తర్వాత 76 బంతుల్లో పంత్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అనంతరం ఎనిమిది పరుగుల వ్యవధిలో పంత్, శ్రేయస్ అయ్యర్ (19) అవుట్ కావడంతో భారత్ కాస్త నెమ్మదించింది. రవీంద్ర జడేజా (23) కొద్ది సేపు గట్టిగా నిలబడినా, శార్దుల్ ఠాకూర్ (4) విఫలమయ్యాడు. చివరి వరుస వికెట్లను పెద్దగా ఇబ్బంది పడకుండా వెంటవెంటనే పడగొట్టిన ఇంగ్లండ్ బౌలర్లు భారత్ ఇన్నింగ్స్‌ను తొందరగా ముగించారు. సోమవారం 36.5 ఓవర్లు ఆడిన టీమిండియా మిగిలిన 7 వికెట్లతో 120 పరుగులు సాధించింది.
అదిరే భాగస్వామ్యం...
భారీ లక్ష్యఛేదనను ఇంగ్లండ్ ఓపెనర్లు లీస్, క్రాలీ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించారు. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరు ఆకట్టుకునే షాట్లతో పరుగులు రాబట్టారు. ధాటిగా ఆడిన లీస్ 44 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చూస్తుండగానే భాగస్వామ్యం 100 పరుగులు దాటడంతో భారత బృందంలో ఆందోళన మొదలైంది. అయితే బంతి ఆకారం దెబ్బ తినడంతో మరో బంతిని తీసుకున్న భారత్ అదృష్టం కూడా మారింది. బుమ్రా బంతిని అంచనా వేయడంలో పొరపడిన క్రాలీ క్లీన్‌బౌల్డయ్యాడు. ఇంగ్లండ్ ఓపెనర్లు 21.4 ఓవర్లలోనే 107 పరుగులు జోడించారు. టీ విరామం తర్వాత భారత్ మళ్లీ ఆధిక్యం ప్రదర్శించింది.
తొలి బంతికే పోప్ (0) అవుట్ కాగా, రూట్ పొరపాటుతో లీస్ రనౌటయ్యాడు. ఈ దశలో పరిస్థితి చూస్తే ప్రత్యర్థిని కూల్చడానికి భారత్‌కు ఎంతో సమయం పట్టదనిపించింది. అయితే రూట్, బెయిర్‌స్టో భాగస్వామ్యం టీమిండియా ఆశలపై నీళ్లు చల్లింది. ఆరంభంలో రూట్ చక్కటి షాట్లు ఆడగా, కుదురుకున్న తర్వాత బెయిర్‌స్టో దూకుడు పెంచాడు. మన బౌలర్లు పూర్తిగా పట్టు కోల్పోవడంతో ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు చేసిన రూట్, బెయిర్‌స్టో విజయానికి బాటలు వేస్తూ పటిష్ట స్థితిలో రోజును ముగించారు. 14 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో విహారి వదిలేశాడు. అది పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో!
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ 416; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 284;
భారత్ రెండో ఇన్నింగ్స్: గిల్ (సి) క్రాలీ (బి) అండర్సన్ 4; పుజారా (సి) లీస్ (బి) బ్రాడ్ 66; విహారి (సి) బెయిర్‌స్టో (బి) బ్రాడ్ 11; కోహ్లి (సి) రూట్ (బి) స్టోక్స్ 20; పంత్ (సి) రూట్ (బి) లీచ్ 57; శ్రేయస్ (సి) అండర్సన్ (బి) పాట్స్ 19; జడేజా (బి) స్టోక్స్ 23; శార్దుల్ (సి) క్రాలీ (బి) పాట్స్ 4; షమీ (సి) లీస్ (బి) స్టోక్స్ 13; బుమ్రా (సి) క్రాలీ (బి) స్టోక్స్ 7; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (81.5 ఓవర్లలో ఆలౌట్) 245.
వికెట్ల పతనం: 1–4, 2–43, 3–75, 4–153, 5–190, 6–198, 7–207, 8–230, 9–236, 10–245.
బౌలింగ్: అండర్సన్ 19–5–46–1, బ్రాడ్ 16–1– 58–2, పాట్స్ 17–3–50–2, లీచ్ 12–1–28–1, స్టోక్స్ 11.5–0–33–4, రూట్ 6–1–17–0.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: లీస్ (రనౌట్) 56; క్రాలీ (బి) బుమ్రా 46; పోప్ (సి) పంత్ (బి) బుమ్రా 0; రూట్ (బ్యాటింగ్) 76; బెయిర్‌స్టో (బ్యాటింగ్) 72; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (57 ఓవర్లలో 3 వికెట్లకు) 259.
వికెట్ల పతనం: 1–107, 2–107, 3–109.
బౌలింగ్: బుమ్రా 13–0–53–2, షమీ 12–2–49–0, రవీంద్ర జడేజా 15–2–53–0, సిరాజ్ 10–0–64–0, శార్దుల్ ఠాకూర్ 7–0–33–0.
Comments
Please login to add a commentAdd a comment