
టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో దూసుకుపోతున్నప్పటికీ.. టెస్ట్‌ల్లో మాత్రం ఆశించినంతగా రాణించలేకపోతున్నాడన్నది కాదనలేని సత్యం. అతడి గణాంకాలే ఇందుకు నిదర్శనం. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో గిల్ ఇప్పటివరకు ఆడిన 58 మ్యాచ్‌ల్లో 7 సెంచరీలు (ఓ వన్డే డబుల్ సెంచరీ), 14 హాఫ్ సెంచరీల సాయంతో 2606 పరుగులు సాధించగా.. 43 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీల సాయంతో కేవలం 1292 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
గిల్ గణాంకాల్లో ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. అదేంటంటే.. గిల్ తన 23 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఫట్టనిపించినా.. సెకెండ్ ఇన్నింగ్స్‌ల్లో మాత్రం హిట్టనిపించాడు. గిల్ తానాడిన 23 తొలి ఇన్నింగ్స్‌ల్లో 25.91 సగటున కేవలం 596 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి.
సెకెండ్ ఇన్నింగ్స్‌ల విషయానికొస్తే గిల్ చాలా మెరుగ్గా కనిపిస్తున్నాడు. 20 ఇన్నింగ్స్‌ల్లో 40.94 సగటున 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 696 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు చూసి నెటిజన్లు గిల్‌ను సెకెండ్ ఇన్నింగ్స్ హీరో అంటున్నారు. టెస్ట్‌ల్లో సెకెండ్ ఇన్నింగ్స్‌ల్లో లాగే గిల్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ ఛేజింగ్‌లో మాంచి రికార్డే ఉంది. ఈ ఫార్మాట్లలో గిల్ ఇప్పటివరకు చేసిన సెంచరీల్లో సగం ఛేదనల్లో చేసినవే కావడం విశేషం.
ఇదిలా ఉంటే, ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో గిల్ పర్వాలేదనిపిస్తున్నాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో (23, 0) విఫలమైనా.. రెండు (34, 104), మూడు టెస్ట్‌ల్లో (0, 91) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మూడో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ గిల్ తొమ్మిది పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు.
మూడో టెస్ట్‌లో గిల్‌తో పాటు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ చెలరేగడంతో భారత్ 434 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు మ్యాచ్‌లో విజయాలు సాధించి మరో సిరీస్ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది.