Ind Vs NZ, 3rd ODI: India Complete Clean Sweep Against New Zealand - Sakshi
Sakshi News home page

IND Vs NZ: టీమిండియా చేతిలో కివీస్‌ క్లీన్‌స్వీప్‌.. వన్డే సిరీస్‌ మనదే

Published Wed, Jan 25 2023 5:30 AM | Last Updated on Wed, Jan 25 2023 9:49 AM

Ind vs NZ, 3rd ODI: India Complete Clean Sweep Against New Zealand - Sakshi

ఇండోర్‌: మళ్లీ భారత బ్యాట్లు గర్జించాయి. న్యూజిలాండ్‌ బంతులు డీలా పడ్డాయి. దీంతో పరుగుల తుఫాన్‌లో కివీస్‌ క్లీన్‌స్వీప్‌ అయ్యింది. ఫలితంగా మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్‌ 90 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 3–0తో దక్కించుకుంది. అంతేకాకుండా వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి రోహిత్‌ శర్మ బృందం మూడో స్థానం నుంచి మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకింది.

మొదట భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), శుబ్‌మన్‌ గిల్‌ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. తర్వాత న్యూజిలాండ్‌ 41.2 ఓవర్లలో 295 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్‌ కాన్వే (100 బంతుల్లో 138; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు శార్దుల్‌కు దక్కగా... శుబ్‌మన్‌ గిల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారం అందుకున్నాడు.   

ఓపెనర్ల ధనాధన్‌
ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్లు రోహిత్, గిల్‌ కష్టమైన బంతిని, ఓవర్‌ను గౌరవిస్తూ... అదుపు తప్పిన బంతులకు బౌండరీనే శిక్షగా విధించారు. డఫీ ఐదో ఓవర్లో గిల్, రోహిత్‌ చెరో సిక్సర్‌ బాదారు. ఫెర్గూసన్‌ 8వ ఓవర్‌ను గిల్‌ 4, 0, 4, 4, 6, 4లతో చితగ్గొట్టాడు. ఏకంగా 22 పరుగుల్ని పిండుకున్నాడు. డఫీ పదో ఓవర్లో రోహిత్‌ ఒక బౌండరీ రెండు సిక్స్‌లు బాదాడు. ఓపెనర్ల ధాటికి భారత్‌ స్కోరు 12.4 ఓవర్లలో వంద దాటింది. గిల్‌ 33 బంతుల్లో (8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్‌ 41 బంతుల్లో (4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు.

కానీ కివీస్‌ బౌలర్లే జోడీని విడగొట్టలేకపోయారు. ఓవర్‌కు 8 పైచిలుకు పరుగుల రన్‌రేట్‌తో భారత్‌ 24.1 ఓవర్లోనే 200 పరుగుల మైలురాయి చేరుకుంది. ఆ వెంటనే రోహిత్‌ 83 బంతుల్లో, గిల్‌ 72 బంతుల్లో శతకాలు పూర్తిచేసుకున్నారు. రోహిత్‌ను బౌల్డ్‌ చేసి బ్రేస్‌వెల్‌ 212 పరుగుల ఓపెనింగ్‌ వికెట్‌ కు తెరదించాడు. కాసేపటికే గిల్‌ జోరుకు టిక్నెర్‌ చెక్‌ పెట్టాడు. తర్వాత కోహ్లి (36; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఇషాన్‌ (17; 1 ఫోర్, 1 సిక్స్‌), సూర్య (14; 2 సిక్సర్లు) విఫలమయ్యారు. పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), శార్దుల్‌ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అండతో చెలరేగాడు.  

కాన్వే సెంచరీ వృథా
న్యూజిలాండ్‌ ఖాతా తెరువక ముందే అలెన్‌ (0)ను పాండ్యా డకౌట్‌ చేశాడు. మరో ఓపెనర్‌ కాన్వే ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. నికోల్స్‌ (42; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండతో సిక్సర్లతో మెరిపించాడు. నికోల్స్‌ ఆటను కుల్దీప్‌ ముగించగా.. ఆ తర్వాత మిచెల్‌ (24; 2 ఫోర్లు), లాథమ్‌ (0), ఫిలిప్స్‌ (5)లు శార్దుల్‌ పేస్‌కు తలవంచారు. కాన్వే 71 బంతుల్లో సెంచరీ సాధించాడు. అతన్ని ఉమ్రా న్‌ అవుట్‌ చేశాడు. బ్రేస్‌వెల్‌ (26; 3 ఫోర్లు, 1 సిక్స్‌), సాన్‌ట్నర్‌ (34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు క్రీజులో నిలిచారు.

30: వన్డేల్లో రోహిత్‌ శర్మ సెంచరీలు. అత్యధిక శతకాలు చేసిన క్రికెటర్ల జాబితాలో పాంటింగ్‌తో కలిసి రోహిత్‌ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. సచిన్‌ (49), కోహ్లి (46) టాప్‌–2లో ఉన్నారు.
360: న్యూజిలాండ్‌తో సిరీస్‌లో గిల్‌ చేసిన రన్స్‌. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా బాబర్‌ ఆజమ్‌ (పాక్‌; 2016లో విండీస్‌పై) పేరిట ఉన్న రికార్డును గిల్‌ సమం చేశాడు.
19: న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో భారత బ్యాటర్ల సిక్స్‌ల సంఖ్య. 2013లో ఆస్ట్రేలియాపై కూడా భారత్‌ 19 సిక్స్‌లు కొట్టింది.  

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) బ్రేస్‌వెల్‌ 101; గిల్‌ (సి) కాన్వే (బి) టిక్నెర్‌ 112; కోహ్లి (సి) అలెన్‌ (బి) డఫీ 36; ఇషాన్‌ (రనౌట్‌) 17; సూర్యకుమార్‌ (సి) కాన్వే (బి) డఫీ 14; పాండ్యా (సి) కాన్వే (బి) డఫీ 54; సుందర్‌ (సి) మిచెల్‌ (బి) టిక్నెర్‌ 9; శార్దుల్‌ (సి) లాథమ్‌ (బి) టిక్నెర్‌ 25; కుల్దీప్‌ (రనౌట్‌) 3; ఉమ్రాన్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 385.
వికెట్ల పతనం: 1–212, 2–230, 3–268, 4–284, 5–293, 6–313, 7–367, 8–379, 9–385.
బౌలింగ్‌: డఫీ 10–0–100–3, ఫెర్గూసన్‌ 10–1–53–0, టిక్నెర్‌ 10–0–76–3, సాన్‌ట్నర్‌ 10–0–58–0, మిచెల్‌ 4–0–41–0, బ్రేస్‌వెల్‌ 6–0–51–1.

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: అలెన్‌ (బి) పాండ్యా 0; కాన్వే (సి) రోహిత్‌ (బి) ఉమ్రాన్‌ 138; నికోల్స్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్‌ 42; మిచెల్‌ (సి) ఇషాన్‌ (బి) శార్దుల్‌ 24; లాథమ్‌ (సి) పాండ్యా (బి) శార్దుల్‌ 0; ఫిలిప్స్‌ (సి) కోహ్లి (బి) శార్దుల్‌ 5; బ్రేస్‌వెల్‌ (స్టంప్డ్‌) ఇషాన్‌ (బి) కుల్దీప్‌ 26; సాన్‌ట్నర్‌ (సి) కోహ్లి (బి) చహల్‌ 34; ఫెర్గూసన్‌ (సి) రోహిత్‌ (బి) కుల్దీప్‌ 7; డఫీ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్‌ 0; టిక్నెర్‌ (నా టౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (41.2 ఓవర్లలో ఆలౌట్‌) 295.
వికెట్ల పతనం: 1–0, 2–106, 3–184, 4–184, 5–200, 6–230, 7–269, 8–279, 9–280, 10–295.
బౌలింగ్‌: పాండ్యా 6–0–37–1, సుందర్‌ 6–0–49–0, శార్దుల్‌ 6–0–45–3, ఉమ్రాన్‌ 7–0–52–1, కుల్దీప్‌ 9–0–62–3, చహల్‌ 7.2–0–43–2.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement