
వర్దమాన ఆసియా టీ20 కప్-2024లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఘటనపై పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ స్పందించాడు. యువ ఆటగాళ్లకు ప్రత్యర్థి జట్టును గౌరవించే సంస్కారం నేర్పాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు హితవు పలికాడు. అభిషేక్ శర్మ పట్ల సూఫియాన్ ముఖీమ్ ప్రవర్తన సరికాదంటూ మండిపడ్డాడు.
కాగా ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నీలో భారత్-‘ఎ’ జట్టు శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఒమన్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్-‘ఎ’పై తిలక్ వర్మ సేన ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది. శనివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా.. భారత ఓపెనర్ అభిషేక్ శర్మను రెచ్చగొట్టేలా పాక్ యువ స్పిన్నర్ సూఫియాన్ ముఖీమ్ ప్రవర్తించాడు.
అభిషేక్ ధనాధన్
టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసిన క్రమంలో అభిషేక్.. 22 బంతులు ఎదుర్కొని 35 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు బౌండరీలు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే, దూకుడుగా ఆడుతున్న సమయంలో ఆరో ఓవర్ ఆఖరి బంతికి సూఫియాన్ బౌలింగ్‌లో అభిషేక్.. కాసిం అక్రంకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

సూఫియాన్ ఓవరాక్షన్
దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే, అభిషేక్ అవుట్ కాగానే సూఫియాన్ ఓవరాక్షన్ చేశాడు. ‘నోరు మూసుకుని.. ఇక దయచెయ్’’ అన్నట్లుగా ముక్కుమీద వేలు వేసి అభిషేక్‌కు సైగ చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన అభిషేక్ సూఫియాన్ వైపునకు సీరియస్‌గా చూశాడు. ఈ క్రమంలో అంపైర్లు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
నువ్వేమైనా హ్యాట్రిక్ హీరోవా?
ఈ ఘటనపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ స్పందిస్తూ.. ‘‘క్రికెట్ అంటేనే టాప్ క్లాస్. కానీ.. సూఫియాన్ ముఖీమ్- అభిషేక్ శర్మ మధ్య జరిగిన ఘటన నన్ను నిరాశకు గురిచేసింది. ఒకవేళ నేనే గనుక పాక్ జట్టు టీమ్ మేనేజర్‌గా డకౌట్‌లో ఉండి ఉంటే.. వెంటనే సూఫియాన్‌ను పిలిచి.. ‘‘బేటా.. ఇక బ్యాగు సర్దుకుని బయల్దేరు’ అని చెప్పేవాడిని.
బుద్ధి నేర్పించాలి
నువ్వసలు పాకిస్తాన్ తరఫున ఇంకా పూర్తిస్థాయిలో క్రికెట్ ఆడనేలేదు. ఇప్పుడే ఇలా అసభ్యకరమైన రీతిలో ప్రత్యర్థి జట్టు ఆటగాడిని దూషిస్తావా? ఇదేం ప్రవర్తన? నువ్వేమైనా హ్యాట్రిక్ హీరోవా? ఇంకా నీ బౌలింగ్‌పై ఎవరికీ అవగాహనే లేదు. అప్పుడే ఇలాంటి ప్రవర్తనా? మేనేజ్‌మెంట్ యువ ఆటగాళ్లకు కాస్త బుద్ధి నేర్పించాలి.
ప్రత్యర్థి జట్టును గౌరవించాలనే సంస్కారం నేర్పించండి’’ అని పీసీబీకి హితవు పలికాడు. కాగా పాకిస్తాన్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి.. భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన అన్షుల్ కాంబోజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
చదవండి: WTC 2023-25 Points Table: న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?
WATCH:
SUFIYAN MUQEEM ASKED ABHISHEK SHARMA TO LEAVE THE GROUND#INDvPAK #EmergingAsiaCup2024 pic.twitter.com/RJHOLCULYc— Junaid (@ccricket713) October 19, 2024