సౌతాఫ్రికా టెస్టు జట్టు (ఫైల్ ఫొటో)
South Africa vs India- Test Series: టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. సఫారీ స్టార్ పేసర్ కగిసో రబడ మడిమ నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో భారత్‌తో సిరీస్‌కు ముందు దేశవాళీ క్రికెట్ ఆడాలన్న తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. కెప్టెన్ తెంబా బవుమా కూడా ముందుగా అనుకున్నట్లు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో ఆడటం లేదు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా దేశవాళీ జట్టు లయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఒక్కసారైనా గెలవాలని
పరిమిత ఓవర్ల క్రికెట్‌ను మినహాయిస్తే భారత జట్టు సఫారీ గడ్డపై ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. ఈసారి.. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. వరల్డ్‌కప్-2023 ఫైనల్ ఓటమి బాధలో ఉన్న అభిమానులకు చారిత్రాత్మక గెలుపుతో ఊరటనివ్వాలని భావిస్తోంది.
మరోవైపు.. ప్రొటిస్ జట్టు సైతం సొంతగడ్డపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ భారత్‌పై పైచేయి సాధించాలనే తలంపుతో ఉంది. దీంతో ఈసారి టీమిండియా- సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
బవుమా అలా.. గాయంతో రబడ
ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ తెంబా బవుమా టీ20, వన్డే సిరీస్‌లకు దూరం అయ్యాడు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌తో పునరాగమనం చేయాలని భావిస్తున్న బవుమా.. అంతకంటే ముందు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడి పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని భావించాడు.
కెప్టెన్‌తో పాటు పేసర్ రబడ కూడా డొమెస్టిక్ టీమ్ లయన్స్ తరఫున ఆడాలని నిశ్చయించుకున్నాడు. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా బవుమా తన నిర్ణయాన్ని మార్చుకోగా.. రబడ గాయం తాలుకు నొప్పి కారణంగా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో డాల్ఫిన్స్ జట్టుతో తాము ఆడాల్సిన మ్యాచ్‌కు వీరిద్దరు అందుబాటులో ఉండటం లేదని లయన్స్ టీమ్ గురువారం ప్రకటించింది.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా.. రబడ గాయపడ్డాడు. నాటి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో కేవలం ఆరు ఓవర్లు బౌలింగ్ చేసి 41 పరుగులు ఇచ్చాడు రబడ. అయితే, అతడు ఇంతవరకు పూర్తిగా కోలుకోలేదు. మరోవైపు.. అన్రిచ్ నోర్జే కూడా గాయం వల్ల చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు.
చదవండి: రితిక జోలికి వస్తే ఊరుకోను.. నాడు రోహిత్‌కు యువీ వార్నింగ్! ఆమెతో నాకేం పని అంటూ..
Comments
Please login to add a commentAdd a comment