Ravindra Jadeja: మరో అరుదైన ఘనతకు తొమ్మిది వికెట్ల దూరంలో.. | Sakshi
Sakshi News home page

IND VS SL 2nd Test: మరో 9 వికెట్లు పడగొడితే జడ్డూ ఖాతాలో మరో రికార్డు

Published Fri, Mar 11 2022 9:04 PM

IND VS SL: Ravindra Jadeja Eyes Huge Milestone During Bengaluru Test - Sakshi

మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో అజేయమైన 175 పరుగులతో (తొలి ఇన్నింగ్స్‌) పాటు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టి, టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా.. బెంగళూరు వేదికగా రేపటి (మార్చి 12) నుంచి ప్రారంభంకానున్న పింక్‌ బాల్‌ టెస్ట్‌లో మరో అరుదైన ఘనత సాధించేందుకు తహతహలాడుతున్నాడు.

బెంగళూరు టెస్ట్‌లో సర్‌ జడ్డూ మరో 9 వికెట్లు పడగొడితే టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 250 వికెట్లు (58 టెస్ట్‌లు) సాధించిన మూడో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. జడేజాకు ముందు రవిచంద్రన్‌ అశ్విన్‌ (42 టెస్ట్‌లు), అనిల్‌ కుంబ్లే (55) వేగంగా 250 వికెట్ల మైలురాయిని చేరుకున్నారు. ప్రస్తుతం జడేజా 58 టెస్ట్‌ల్లో 241 వికెట్లతో కొనసాగుతున్నాడు. 

ఇదిలా ఉంటే, పింక్‌ బాల్‌ టెస్ట్‌కు జడేజా పూర్తి ఫిట్‌గా లేడని వార్తలు వినిపిస్తున్నాయి. జడ్డూ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసే సమయంలో అసౌకర్యంగా కనిపించాడని, అతనేదో గాయాన్ని దాస్తున్నట్లున్నాడని ఓ ప్రముఖ మీడియా కథనాన్ని ప్రచురితం చేసింది.

ఈ విషయమై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించనప్పటికీ, అతని డిప్యూటీ జస్ప్రీత్‌ బుమ్రా క్లారిటీ ఇచ్చాడు. బెంగళూరు టెస్ట్‌లో టీమిండియా ముగ్గరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని పరోక్ష సంకేతాలు ఇచ్చాడు. ప్రస్తుతం అక్షర్‌తో కలుపుకుని భారత జట్టులో ముగ్గురే స్పిన్నర్లు ఉండటంతో జడేజా రెండో టెస్ట్‌లో ఆడటం ఖాయంగా తెలుస్తోంది.
చదవండి: జడ్డూను కాపీ కొట్టిన పాక్‌ బౌలర్‌.. ట్రోల్స్‌ చేసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement