
గువాహటి: తొలి టి20లో బౌలర్ల అద్భుత ప్రదర్శనతో శుభారంభం చేసిన టీమిండియా ఇప్పుడు వరుస విజయంతో వరుసగా మరో సిరీస్‌పై కన్నేసింది. ప్రధాన సీమర్ బుమ్రా అనూహ్యంగా గాయంతో వైదొలిగినప్పటికీ భారత బౌలింగ్ ఇప్పుడు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌కు అదనపు బలగంగా మారడం జట్టు మేనేజ్‌మెంట్‌లో ఎక్కడలేని ఉత్సాహం నింపింది. మరోవైపు భారత సొంతగడ్డపై 20 ఫార్మాట్‌లో మంచి రికార్డు కలిగిన దక్షిణాఫ్రికా జట్టు తిరువనంతపురంలో పేలవమైన ఆటతీరుతో డీలాపడింది.
సిరీస్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఈ మ్యాచ్‌కు సిద్ధమైంది. బౌలింగ్‌పై బెంగ లేకపోయినా... బ్యాటింగ్ దళంపై సఫారీ ఆందోళన చెందుతోంది. మ్యాచ్ వేదికైన బర్సాపారా స్టేడియంలో భారత్ రెండు టి20 మ్యాచ్‌లు ఆడింది. 2017లో ఆస్ట్రేలియా చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. 2020లో భారత్, శ్రీలంక మ్యాచ్ టాస్ వేశాక వర్షం కారణంగా రద్దయింది. నేటి మ్యాచ్‌కు కూడా వాన గండం పొంచి ఉంది.
సిరాజ్‌ని ఆడిస్తారా
సిరీస్‌లో ఘనమైన శుభారంభంతో భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ వారి ఫామ్‌పై ఎలాంటి అనుమానాలు లేవు. మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. త్వరలో జరిగే టి20 ప్రపంచకప్‌కు ముందు రోహిత్ బృందానికి అతని సూపర్ ఫామ్ కొండంత బలాన్నిస్తోంది.
అతను ఆడే కచ్చితమైన షాట్లు, టైమింగ్, ప్లేసింగ్ ఎలాంటి బౌలర్‌కైనా కలవరపెట్టక మానదు. అతని ఇన్నింగ్స్‌లవల్లే పంత్, దినేశ్ కార్తీక్‌లకు క్రీజులో సరైన అవకాశాలు రావట్లేదనే చెప్పాలి. ఇక బౌలింగ్ విషయానికొస్తే బుమ్రా స్థానంలో వచ్చిన హైదరాబాద్ స్పీడ్‌స్టర్ సిరాజ్‌ను తుదిజట్టుకు ఆడిస్తారో లేదో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సీమర్లు చహర్, అర్‡్షదీప్, హర్షల్ పటేల్ వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు.
ఒత్తిడిలో సఫారీ
గత మ్యాచ్ ఫలితం కంటే ప్రదర్శనే దక్షిణాఫ్రికాకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ప్రత్యేకించి పరిమిత ఓవర్ల స్పెషలిస్టులు, హిట్టర్లు అందుబాటులో ఉన్న సఫారీ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిన తీరు ఆ జట్టును తీవ్రంగా కలవరపెడుతోంది. మూడు ఓవర్లు ముగియకముందే బ్యాటింగ్ బలగమంతా కకావికలమైంది. టెయిలెండర్ కేశవ్ మహరాజ్ పుణ్యమాని వంద దాటింది.
లేదంటే ఆరంభ ఓవర్ల ఆటచూస్తే దక్షిణాఫ్రికాకు 50 పరుగులే కష్టమనిపించింది. ఇప్పుడు భారత బౌలర్లనే కాదు... తప్పక గెలవాల్సిన ఒత్తిడిని ఆ జట్టు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. నోర్జే, రబడ, పార్నెల్, షమ్సీలతో కూడిన బౌలింగ్ విభాగం మెరుగ్గానే ఉంది. బౌలర్లు పట్టుబిగించాలంటే పోరాడే స్కోర్లు నమోదు కావాలి. లేదంటే గువాహటిలోనే సిరీస్‌ను కోల్పోవాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment