Virat Kohli Becomes Fastest Batter To Score 5000 ODI Runs At Home: ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో రికార్డుల రారాజు తానేనని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి రుజువు చేసుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టాడు. స్వదేశంలో వేగంగా(96 ఇన్నింగ్స్) 5000 పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
2007లో సచిన్ ఇదే ప్రత్యర్ధిపై(విండీస్) స్వదేశంలో 5000 పరుగుల మైలరాయిని చేరుకున్నాడు. అయితే ఈ మైలురాయిని చేరుకునేందుకు సచిన్‌కు 121 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి. ఇక ఓవరాల్‌గా చూస్తే.. వారి వారి స్వదేశాల్లో వన్డేల్లో 5000కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ నాలుగో స్థానానికి(60.25 సగటుతో 5002 పరుగులు) చేరాడు. సచిన్ భారత్‌లో 48.11 సగటున 6976 పరుగులు చేయగా, పాంటింగ్ 39.71 సగటుతో 5521 పరుగులు, కలిస్ 45.89 యావరేజ్‌తో 5186 పరుగులు చేశారు.
ఇదిలా ఉంటే, విండీస్‌తో తొలి వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. స్పిన్నర్లు యుజ్వేంద్ర చహల్(4/49), వాషింగ్టన్ సుందర్(3/30), పేసర్లు ప్రసిద్ద్ కృష్ణ(2/29), మహ్మద్ సిరాజ్(1/26) చెలరేగడంతో 43.5 ఓవర్లలో 176 పరుగులకే కుప్పకూలింది. జేసన్ హోల్డర్(71 బంతుల్లో 57; 4 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం 177 పరగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. మధ్యలో కాస్త తడబడినా చివరకు 6 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించి, 3 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోని దూసుకుపోయింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ(60), ఇషాన్ కిషన్(28) తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించి గెలుపుకు పునాది వేయగ, ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 34; 5 ఫోర్లు), దీపక్ హూడా(32 బంతుల్లో 26; 2 ఫోర్లు) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు. కోహ్లి(8), పంత్(11) మరోసారి నిరుత్సాహపరిచారు. విండీస్ బౌలర్లలో జోసఫ్ 2 వికెట్లు, అకీల్ హొసేన్‌కు ఓ వికెట్ దిక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా బుధవారం(ఫిబ్రవరి 9) జరగనుంది.
చదవండి: అండర్ 19 వరల్డ్‌కప్ హీరో రాజ్ బవాకి యువరాజ్ సింగ్‌తో ఉన్న లింక్ ఏంటి..?
Comments
Please login to add a commentAdd a comment