వెస్టిండీస్‌తో భారత మహిళల రెండో టీ20
రాత్రి 7 గంటల నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు.. రెండో గెలుపుపై కన్నేసింది. ఇరు జట్ల మధ్య మంగళవారం జరిగే రెండో టీ20లో గెలిస్తే ఈ సిరీస్ హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం ఖాతాలో చేరుతుంది. మరోవైపు గత మ్యాచ్‌లో ఓటమి నుంచి కోలుకొని మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని విండీస్ మహిళలు భావిస్తున్నారు.
ఇక ముంబై వేదికగా తొలి టీ20లో భారత బ్యాటర్లంతా రాణించడం చెప్పుకోదగ్గ సానుకూలాంశం. ఓపెనర్ స్మృతి మంధాన దూకుడుగా ఆడి అర్ధసెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ముఖ్యంగా ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో వన్డేల్లో చిత్తుగా ఓడిన తర్వాత స్వదేశంలో దక్కిన ఈ విజయం జట్టులో ఉత్సాహాన్ని పెంచింది. అయితే ఫీల్డింగ్‌లో టీమ్ కాస్త పేలవ ప్రదర్శన కనబర్చింది.
తొలి మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు మూడు సునాయాస క్యాచ్‌లు వదిలేశారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ చక్కటి బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేయగా... టిటాస్ సాధు వికెట్లు పడగొట్టింది. ప్రధాన పేసర్ రేణుకా సింగ్ కూడా సత్తా చాటాల్సి ఉంది. స్వల్ప లోపాలు ఉన్నా... బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శనతో చెలరేగితే మరో విజయం కష్టం కాబోదు.
మరోవైపు వెస్టిండీస్ కూడా బ్యాటింగ్‌లో బలంగానే ఉంది. ముఖ్యంగా డియాండ్రా డాటిన్ గత మ్యాచ్ తరహాలోనే ధాటిగా ఆడగల సమర్థురాలు. ఖియానా జోసెఫ్ కూడా తొలి టీ20లో రాణించింది. వీరితో పాటు కెప్టెన్, ఓపెనర్ హేలీ మాథ్యూస్ కూడా తన స్థాయికి తగినట్లు ఆడితే విండీస్ బలం పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment