సరిగ్గా నెల రోజుల విరామం తర్వాత భారత అభిమానుల కోసం మళ్లీ క్రికెట్ సందడి. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఓటమిని ఎదుర్కొన్న అనంతరం టీమిండియా మరోసారి సంప్రదాయ క్రికెట్‌లో కొత్త పోరుకు సన్నద్ధమైంది.
2023–25 డబ్ల్యూటీసీ క్యాలెండర్‌లో భాగంగా భారత్ తమ తొలి సిరీస్ బరిలోకి దిగనుంది. ఈ సారి వెస్టిండీస్ రూపంలో బలహీన ప్రత్యర్థి భారత్ ముందుంది. వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించలేక, టెస్టుల్లో అంతంత మాత్రం ప్రదర్శనతోనే పడుతూ లేస్తూ సాగుతున్న విండీస్ జట్టు టీమిండియాకు ఏమాత్రం పోటీనివ్వగలదనేది చూడాలి.
రోసీ (డొమినికా): భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా నేటి నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతుంది. చివరిసారిగా 2019లో విండీస్ గడ్డపై పర్యటించిన భారత్ 2–0తో సిరీస్ గెలుచుకుంది.
ఇప్పు డు కూడా రెండు జట్ల బలాబలాలను చూస్తే భారత్ అన్ని రకాలుగా పటిష్టంగా ఉంది. అయితే సొంతగడ్డపై అప్పుడప్పుడు సంచలనాలు సృష్టించగల సామర్థ్యం విండీస్‌కు ఉంది. వరుసగా రెండుసార్లూ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన భారత్ ఇక్కడి నుంచే సాధ్యమైనన్ని ఎక్కువ పాయింట్లు రాబట్టుకోవాలని భావిస్తోంది.
యశస్విపై దృష్టి...
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన భారత బృందం నుంచి చూస్తే దాదాపు అదే తుది జట్టుతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన తేడా మూడో స్థానంలో పుజారా లేకపోవడమే. ఈ సిరీస్ కోసం కొత్తగా ప్రయత్నించేందుకు యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ రూపంలో భారత్‌కు అవకాశం ఉంది. బౌలింగ్‌లో షమీకి ఈ సిరీస్ నుంచి విశ్రాంతినివ్వగా... నవదీప్ సైనీ లేదా జైదేవ్ ఉనాద్కట్‌లలో ఒకరికి అవకాశం లభిస్తుంది. ప్రధాన పేసర్‌గా సిరాజ్... స్పిన్నర్లుగా రవీంద్ర జడేజాతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడని అశ్విన్ కూడా తుది జట్టులో ఉంటారు.
సమష్టిగా ఆడితేనే...
చాలా కాలంగా వెస్టిండీస్ టెస్టు జట్టు పేలవ ఫామ్‌లోనే ఉంది. చివరిసారిగా మార్చిలో టెస్టు సిరీస్ ఆడిన ఆ జట్టు 0–2తో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. కెపె్టన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్, తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ ఓపెనర్లుగా అందించే ఆరంభం జట్టుకు కీలకం కానుంది. తర్వాతి బ్యాటర్లలో రీఫర్, బ్లాక్‌వుడ్ మాత్రమే నమ్మదగిన ఆటగాళ్లు.
ఆల్‌రౌండర్‌గా రోచ్ అనుభవం జట్టుకు ఉపయోగపడవచ్చు. కైల్ మేయర్స్ లేకపోవడం లోటు. రోచ్, జోసెఫ్, హోల్డర్ పేస్ బౌలింగ్ భారం మోస్తారు. షెనాన్ గాబ్రియెల్‌కు అవకాశం దక్కుతుందా చూడాలి. వీరు తమ స్థాయికి తగినట్లుగా ఆడితే భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టవచ్చు. కార్న్‌వాల్ రూపంలో రెండో స్పిన్నర్ జట్టులో ఉన్నాడు.
51 వెస్టిండీస్ గడ్డపై విండీస్‌తో భారత్ 51 టెస్టులు ఆడింది. 9 టెస్టుల్లో నెగ్గి, 16 టెస్టుల్లో ఓడింది. 26 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. ఓవరాల్‌గా రెండు జట్ల మధ్య 98 టెస్టులు జరిగాయి. భారత్ 22 టెస్టుల్లో నెగ్గి, 30 టెస్టుల్లో ఓడింది. 46 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి.
రాత్రి 7:30 నుంచి దూరదర్శన్ స్పోర్ట్స్ చానెల్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment