సిరీస్‌ సొంతం చేసుకోవాలని... | India and West Indies third T20 today | Sakshi
Sakshi News home page

సిరీస్‌ సొంతం చేసుకోవాలని...

Published Thu, Dec 19 2024 4:01 AM | Last Updated on Thu, Dec 19 2024 4:01 AM

India and West Indies third T20 today

నేడు భారత్, వెస్టిండీస్‌ మూడో టి20

రాత్రి 7 గంటల నుంచి జియో సినిమా, స్పోర్ట్స్‌ 18లో ప్రత్యక్ష ప్రసారం  

ముంబై: భారత్, వెస్టిండీస్‌ మహిళల జట్ల మధ్య గురువారం నిర్ణయాత్మక మూడో టి20 మ్యాచ్‌ జరగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టి20లో భారత్‌ విజయం సాధించగా... రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ గెలిచి 1–1తో లెక్క సరిచేసింది. తొలి టి20లో బ్యాటర్లు దంచికొట్టడంతో భారీ స్కోరు చేసిన టీమిండియా... రెండో మ్యాచ్‌లో అదే జోరు కొనసాగించలేకపోయింది. గత మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయిన భారత రెగ్యులర్‌ కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం కూడా సందేహమే. 

ఈ నేపథ్యంలో మరోసారి స్మృతి మంధాన జట్టును నడిపించనుంది. బ్యాటింగ్‌లో స్మృతి రాణిస్తున్నా... ఆమెతో పాటు ఇతర ప్లేయర్లు కూడా సత్తా చాటాల్సిన అవసరముంది. ఈ సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అర్ధశతకాలు సాధించిన స్మృతి అదే ఫామ్‌ కొనసాగించాలని మేనేజ్‌మెంట్‌ ఆశిస్తుండగా... జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ నిలకడ ప్రదర్శించాల్సిన అవసరముంది. 

బౌలింగ్‌లో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌ బ్యాటర్లు విజృంభిస్తుంటే... మన బౌలర్లు వారిని అడ్డుకోవడంలో విఫలమయ్యారు. సీనియర్లు దీప్తి శర్మ, రాధ యాదవ్, రేణుక సింగ్‌తో పాటు యంగ్‌ప్లేయర్లు సైమా ఠాకూర్, సజీవన్‌ సజన, టిటాస్‌ సాధు సమష్టిగా సత్తా చాటాల్సిన అవసరముంది. మరోవైపు రెండో టి20లో విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉన్న వెస్టిండీస్‌ అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. 

ఈ ఫార్మాట్‌లో భారత్‌ చేతిలో వరుసగా తొమ్మిది పరాజయాల తర్వాత గత మ్యాచ్‌లో విజయం సాధించిన కరీబియన్‌ జట్టు సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ముఖ్యంగా కెప్టెన్‌ హేలీ మాథ్యూస్, క్యాంప్‌బెల్, డాటిన్‌ ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో కరీబియన్‌ ప్లేయర్లు భారత బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నారు. 150 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 26 బంతులు మిగిలుండగానే పూర్తి చేశారు. సిరీస్‌ సొంతం చేసుకోవాలంటే కరీబియన్‌ హిట్టర్ల దూకుడును భారత్‌ అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement