
భారత మాజీ అంపైర్ అనిల్ చౌదరి.. ఇప్పుడు కామెంటేటర్‌గా సరికొత్త అవతారమెత్తాడు. ఐపీఎల్-2025 సీజన్‌లో హర్యాన్వి బాషలో చౌదరి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నాడు. అయితే అనిల్ చౌదరి తాజాగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌తో తను మాట్లాడిన ఓ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఈ వీడియోలో చౌదరి, కిషన్ మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం చర్చానీయంశమైంది. అందుకు కారణం పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌ను కిషన్ విమర్శించడమే. మహ్మద్ రిజ్వాన్ పదే పదే వికెట్ల వెనక అప్పీల్ చేయడాన్ని కిషన్ ట్రోల్ చేశాడు.
అసలేం జరిగిందంటే?
అంపైర్ అనిల్ చౌదరి: కిషన్.. నువ్వు ఆడిన చాలా మ్యాచ్‌ల్లో నేను అంపైర్‌గా వ్యవహరించాను. ఇప్పుడు నీవు చాలా పరిణితి చెందిన ఆటగాడిగా మారావు. గతంలో వికెట్ కీపింగ్ చేసే పదే పదే అప్పీల్ చేసి అంపైర్‌లు చిరాకు తెప్పించేవాడివి. కానీ ఇప్పుడు మాత్రం అవసరమైనప్పుడు మాత్రమే అప్పీలు చేస్తున్నావు. ఈ మార్పు నీలో ఎలా వచ్చింది?
ఇషాన్ కిషన్: ఇప్పుడు అంపైర్‌లు చాలా తెలివిగా ఉన్నారు. మనం ప్రతిసారీ అప్పీల్ చేస్తే అంపైర్ అవుట్‌కు కూడా నాటౌట్ ఇస్తాడు. అంపైర్‌లకు వారి తీసుకున్న నిర్ణయాలపై నమ్మకం ఉండాలంటే సరైన సమయంలో అప్పీల్ చేస్తే బెటర్. లేకపోతే మహ్మద్ రిజ్వాన్ లాగా పదపదే అప్పీల్ చేస్తే.. అంపైర్లు ఒక్కొసారి ఔటైనా కూడా నాటౌట్ ఇస్తారని కిషన్ ఫన్నీగా సమాధనమిచ్చాడు.
ఈ సందర్భంగా అంపైరింగ్ కోసం కిషన్ మాట్లాడాడు. కొత్తగా వచ్చే అంపైర్లు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింత నమ్మకంగా ఉండాలని కిషన్ పేర్కొన్నాడు. కాగా ఈ జార్ఖండ్ డైన్‌మేట్ ప్రస్తుతం ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో మెరిశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 106 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే దేశవాళీ క్రికెట్, ఫ్రాంచైజీ లీగ్‌లలో దుమ్ములేపుతున్న కిషన్.. జాతీయ జట్టుకు మాత్రం గత కొంత కాలంగా దూరంగా ఉన్నాడు.
చదవండి: టిమ్ సీఫర్ట్ ప్రపంచ రికార్డు.. పాక్‌పై చితక్కొట్టి అరుదైన ఘనత