వరల్డ్‌కప్‌లో కుదరలేదు.. ఈసారి సిరాజ్‌దే! ట్విస్ట్‌ ఏంటంటే.. | India Bring Back Fielding Medal, Pick New Winner As Best Fielder For South Africa T20Is - Sakshi
Sakshi News home page

వరల్డ్‌కప్‌లో కుదరలేదు.. ఈసారి సిరాజ్‌ సాధించేశాడు! పాపం రింకూ..

Published Fri, Dec 15 2023 12:11 PM | Last Updated on Fri, Dec 15 2023 1:49 PM

India Bring Back Fielding Medal Pick New Winner For South Africa T20Is Siraj - Sakshi

రింకూ సింగ్‌- మహ్మద్‌ సిరాజ్‌ (PC: BCCI)

బెస్ట్‌ ఫీల్డర్‌ మెడల్‌ ప్రదానం చేసే సంప్రదాయాన్ని తిరిగి ప్రవేశపెట్టింది టీమిండియా శిక్షణా సిబ్బంది. అయితే, ఈసారి కాస్త పేరు మార్చి అమల్లోకి తెచ్చింది. సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌-2023 సందర్భంగా.. ఫీల్డింగ్‌ కోచ్‌ టి.దిలీప్‌ వినూత్న సంప్రదాయానికి తెరతీసిన విషయం తెలిసిందే.

ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లలో అద్భుతమైన ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఆటగాళ్లకు డ్రెస్సింగ్‌రూంలో మెడల్‌ ఇవ్వడం ఆనవాయితీ చేశాడు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ తదితరులు బెస్ట్‌ ఫీల్డర్‌ మెడల్‌ గెలుచుకోగా.. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఏకంగా రెండుసార్లు పతకం అందుకున్నాడు.

ఇక వరల్డ్‌కప్‌ సందర్భంగా ఇలా పతకాలు ప్రదానం చేయడం ఆటగాళ్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని.. అందుకే ద్వైపాక్షిక సిరీస్‌ల సందర్భంగా కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు టి.దిలీప్‌ తెలిపాడు. ఈ నేపథ్యంలో ఇకపై ‘ఇంపాక్ట్‌ ఫీల్డర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ పేరిట మెడల్‌ అందించనున్నారు.

ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటన నుంచే దీనిని అమలు చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా.. టీ20 సిరీస్‌లో ఫీల్డింగ్‌ మెడల్‌ కోసం రింకూ సింగ్‌, యశస్వి జైశ్వాల్‌, మహ్మద్‌ సిరాజ్‌ నామినేషన్లలో నిలవగా.. హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌నే పతకం వరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఇక ఇంపాక్ట్‌ ఫీల్డర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ తొలి మెడల్‌ అందుకున్న సిరాజ్‌.. ఒలింపియన్స్‌ మాదిరి దానిని పంటితో కొరుకుతూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. వరల్డ్‌కప్‌ ఈవెంట్‌ నుంచి ఈ పతకం సాధించాలని తాపత్రయపడ్డానని.. ఇప్పటికీ తన కోరిక తీరిందని హర్షం వ్యక్తం చేశాడు. 

పట్టుదలగా ప్రయత్నిస్తే తప్పక ఫలితం లభిస్తుందనే మాట మరోసారి నిరూపితమైందని సిరాజ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు సిరాజ్‌. ఈ క్రమంలో మూడో మ్యాచ్‌లో అద్భుతరీతిలో ప్రొటిస్‌ ఓపెనర్‌, రెండో టీ20 హీరో రీజా హెన్రిక్స్‌ను రనౌట్‌ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. అయితే, ఈ మ్యాచ్‌లో సిరాజ్‌కు ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement