1–2తో అనూహ్య ఓటమి
తన 150వ మ్యాచ్‌లో కెప్టెన్ సునీల్ ఛెత్రికి నిరాశ
గువాహటి: ఫుట్‌బాల్‌లో భారత జట్టు దీనావస్థను చూపించే మరో ఉదాహరణ! ఆసియాలో అనామక జట్లలో ఒకటైన అఫ్గానిస్తాన్‌తో నాలుగు రోజుల క్రితం జరిగిన మ్యాచ్‌లో ఒక్క గోల్ కూడా చేయకుండా ‘డ్రా’గా ముగించిన భారత్ ఆటతీరు ఈసారి మరింత దిగజారింది. 2026 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మంగళవారం సొంతగడ్డపై జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లోనూ భారత్ కనీస ప్రదర్శనను ఇవ్వలేకపోయింది.
చివరకు 1–2 గోల్స్ తేడాతో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ పరాజయంతో ఆసియా క్వాలిఫయర్స్‌లో భారత జట్టు మూడో రౌండ్‌కు అర్హత సాధించే అవకాశాలకు పెద్ద దెబ్బ పడింది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో నాలుగు మ్యాచ్‌ల తర్వాత భారత్ ఖాతాలో 4 పాయింట్లే ఉన్నాయి. మన టీమ్ తర్వాతి మ్యాచ్‌లలో కువైట్ (జూన్ 6న కోల్‌కతాలో), ఆసియా చాంపియన్ ఖతర్ (జూన్ 11న దోహాలో) జట్లతో తలపడాల్సి ఉంది.
అఫ్గాన్‌తోనే ఓడిన మన టీమ్ ఈ నాణ్యమైన టీమ్‌లపై ఏమాత్రం ప్రభావం చూపిస్తుందనేది సందేహమే. చివరిసారి 2013లో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోయిన భారత జట్టు ఈ మ్యాచ్‌లో ముందుగా గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్లి కూడా ఆఖరికి మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించింది.
భారత్ తరఫున 38వ నిమిషంలో సునీల్ ఛెత్రి కెరీర్‌లో 94వ గోల్ నమోదు చేయగా... అఫ్గానిస్తాన్ ఆటగాళ్లలో రహ్మత్ అక్బరీ (70వ ని.లో), షరీఫ్ ముఖమ్మద్ (88వ ని.లో) గోల్స్ చేశారు. తన 150వ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఛెత్రి గోల్ చేయడం విశేషమే అయినా... ఓటమి భారత్‌ను నిరాశకు గురి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment