సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 11 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో వెళ్లింది. మూడో టీ20లో గెలుపు అనంతరం టీమిండియా ఓ అరుదైన రికార్డు తమ ఖాతాలో వేసుకుంది. పాక్ తర్వాత విదేశాల్లో 100 విజయాలు సాధించిన రెండో జట్టుగా రికార్డుల్లోకెక్కింది.
ఓవరాల్‌గా భారత్ ఇప్పటివరకు 241 టీ20 మ్యాచ్‌లు ఆడి 164 మ్యాచ్‌లో విజయాలు సాధించింది. విదేశాల్లో 152 టీ20లు ఆడిన భారత్ 100 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించగా.. విదేశాల్లో 203 టీ20లు ఆడిన పాక్ 116 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.
200 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా..!
సౌతాఫ్రికాతో మూడో టీ20లోనే టీమిండియా మరో రికార్డు తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొత్తం 13 సిక్సర్లు బాదిన భారత్.. టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో 200 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.
శతక్కొట్టిన తిలక్ వర్మ.. విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మ
సౌతాఫ్రికాతో మూడో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (56 బంతుల్లో 107 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్సర్లు), అభిషేక్ శర్మ (25 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. టీ20ల్లో 200 పరుగుల మార్కు దాటడం భారత్‌కు ఈ ఏడాది ఇది ఎనిమిదోసారి. టీ20 చరిత్రలో ఏ జట్టు ఓ క్యాలెండర్ ఇయర్‌లో ఇన్ని సార్లు 200 పరుగుల మార్కును దాటలేదు.
పోరాడి ఓడిన సౌతాఫ్రికా..
220 పరుగుల భారీ లక్ష్యాన్నిఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా చివరి నిమిషం వరకు అద్భుతంగా పోరాడి ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. హెన్రిచ్ క్లాసెన్ (41), మార్కో జన్సెన్ (54) సఫారీలను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. భారత బౌలర్లలో అర్షదీప్‌సింగ్ 3, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment