ఖోఖో ప్రపంచకప్ తొలి ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ టోర్నమెంట్‌లో పదహారు పురుషుల, మహిళల జట్లు పాల్గొంటాయని భారత ఖోఖో సమాఖ్య బుధవారం వెల్లడించింది. 2032 నాటికి ఖోఖోకు ఒలింపిక్ క్రీడగా గుర్తింపు తీసుకొచ్చే దిశగా ఇది కీలక ముందడుగు అని పేర్కొంది.
‘ఖోఖో మూలాలు భారత్‌లో ఉన్నాయి. ప్రాచీన క్రీడలో ప్రపంచకప్ నిర్వహించడం ద్వారా ఘన సాంస్కృతిక వారసత్వానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మట్టి నుంచి ప్రారంభమై మ్యాట్ వరకు చేరిన ఈ క్రీడను ఇప్పుడు ప్రపంచంలో 54 దేశాలు ఆడుతున్నాయి.
2032 నాటికి ఖోఖోకు ఒలింపిక్ క్రీడగా గుర్తింపు దక్కేలా చేయడమే మా అంతిమ లక్ష్యం. అందులో ప్రపంచకప్ తొలి అడుగు’ అని ఖోఖో సమాఖ్య అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ పేర్కొన్నాడు.
క్వార్టర్ ఫైనల్లో భారత్
నాన్‌చాంగ్ (చైనా): ప్రపంచ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. టర్కీతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఇ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 110–99 పాయింట్లతో విజయం సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఈ టోర్నీలో ప్రయోగాత్మకంగా రిలే స్కోరింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది.
ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరుగుతుండగా... తొలుత 110 పాయింట్లు చేరిన జట్టు విజేతగా నిలుస్తుంది. టర్కీకంటే ముందు పెరూ, అజర్‌బైజాన్, మారిషస్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు గెలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ఇండోనేసియాతో భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment