జూనియర్ ఆసియా కప్ హాకీ టైటిల్ కోసం నేడు అమీతుమీ
సెమీఫైనల్స్‌లో మలేసియాపై భారత్; జపాన్‌పై పాకిస్తాన్ విజయం
మస్కట్: జూనియర్ ఆసియా కప్ హాకీ పురుషుల టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు టైటిల్ నిలబెట్టుకునేందుకు విజయం దూరంలో ఉంది. మంగళవారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 3–1 గోల్స్‌తో మలేసియాపై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున దిల్‌రాజ్ సింగ్ (10వ నిమిషంలో), రోహిత్ (45వ నిమిషంలో), శార్దానంద్ తివారి (52వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మలేసియా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను అజీముద్దీన్ 57వ నిమిషంలో సాధించాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ తొలి క్వార్టర్‌లోనే ఖాతా తెరిచింది. పదో నిమిషంలో అరిజీత్ సింగ్ పాస్‌ను నేర్పుగా దిల్‌రాజ్ గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. అయితే మలేసియా కూడా ఆరంభంలో హోరాహోరీగా తలపడింది. ఈ క్రమంలో తొలి క్వార్టర్‌లో లభించిన రెండు పెనాల్టీ కార్నర్‌లను భారత డిఫెండర్లు నీరుగార్చారు.
గోల్ కీపర్ బిక్రమ్‌జీత్ సింగ్, అంకిత్ పాల్ సమన్వయంతో చక్కగా ఆడ్డుకున్నారు. భారత్‌కు రెండో క్వార్టర్‌లో మూడు పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ అందులో ఒక్కటి కూడా గోల్‌గా మలచలేకపోయింది. మూడో క్వార్టర్ ముగిసే దశలో రోహిత్, ఆఖరి క్వార్టర్‌లో తివారి గోల్స్ చేశారు.
ఈ టోర్నీలో పరాజయం ఎరుగని అజేయ భారత్ కథ ఇప్పుడు ఫైనల్‌కు చేరింది. మరో సెమీఫైనల్లో పాక్ 4–2 గోల్స్ తేడాతో జపాన్‌పై విజయం సాధించింది. టైటిల్ కోసం నేడు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment