సీనియర్లు లేకపోయినా ఐపీఎల్ కారణంగా భారత ఆటగాళ్ల తాజా ఫామ్, సొంతగడ్డపై అనుకూలతలు చూస్తే దక్షిణాఫ్రికాపై మనదే పైచేయిగా కనిపించింది. కానీ తొలి మ్యాచ్‌లో 211 పరుగులు చేసి కూడా భారత్ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. దాంతో ఒక్కసారిగా టి20 సిరీస్ ఆసక్తికరంగా మారిపోయింది. బౌలింగ్ వైఫల్యంతో గత మ్యాచ్‌లో ఓడిన టీమిండియా ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందా లేక సఫారీ తమ జోరు కొనసాగిస్తుందా చూడాలి.
కటక్: ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో వెనుకబడిన భారత జట్టు ప్రత్యర్థికి బదులిచ్చేందుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో నేడు జరిగే రెండో టి20లో గెలుపే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో మన బ్యాటర్లు అద్భుతంగా చెలరేగగా... బౌలర్లు ఆశించిన స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయారు. దాంతో లోపాలు సరిదిద్దుకోవడంపై జట్టు దృష్టి పెట్టింది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం కొత్త ఉత్సాహంతో ఆధిక్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది.
మార్పుల్లేకుండానే...
తొలి మ్యాచ్‌లో భారత్ టాప్–5 బ్యాటర్లంతా ఆకట్టుకున్నారు. ఇషాన్ కిషన్ శుభారంభం ఇవ్వగా, రుతురాజ్, శ్రేయస్ రాణించారు. ఆ తర్వాత పంత్ దూకుడుగా ఆడగా, హార్దిక్ తన ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించాడు. వీరంతా మరోసారి చెలరేగితే మళ్లీ భారీ స్కోరు ఖాయం. అయితే ఇంత స్కోరు తర్వాత కూడా ఓడటం బౌలింగ్ పరిమితులను తెలియజేసింది. అందరికంటే సీనియర్ అయిన భువనేశ్వర్ గతి తప్పగా, ఐపీఎల్‌లో చెలరేగిన హర్షల్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
అయితే అన్నింటికి మించి పంత్ కెప్టెన్సీ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. కేవలం ప్రత్యర్థి తప్పులు చేస్తారని వేచి చూడటమే తప్ప... ఏ దశలోనూ అతను చురుకైన వ్యూహాలతో జట్టును నడిపించినట్లు కనిపించలేదు. మంచి ఫామ్‌లో ఉన్న చహల్‌తో పూర్తి కోటా ఓవర్లు వేయించకపోవడం అందులో ఒకటి. అయితే కోచ్ ద్రవిడ్ సిరీస్‌కు ముందు చెప్పినదాని ప్రకారం చూస్తే రెండో మ్యాచ్‌కే మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు.
అదనపు పేసర్‌తో...
212 పరుగుల లక్ష్యం అంటే హోరాహోరీగా సాగుతుందనుకున్న పోరును దక్షిణాఫ్రికా గత మ్యాచ్‌లో ఏకపక్షంగా మార్చేసింది. మూడే వికెట్లు కోల్పోయి ఐదు బంతుల ముందే ఆట ముగించడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. ముఖ్యంగా ఐపీఎల్‌లో జోరు ప్రదర్శించిన మిల్లర్ దూకుడైన ఆటతో తన విలువేమిటో చూపించగా, డసెన్ కూడా విజృంభించాడు. తొలి పోరులో విఫలమైనా... డికాక్, ప్రిటోరియస్ ప్రమాదకరమైన ఆటగాళ్లు.
బౌలింగ్‌లో రెగ్యులర్ పేసర్లు రబడ, నోర్జే భారత బ్యాటర్లను కట్టడి చేయగలరు. గత మ్యాచ్‌లో ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లు కేశవ్ మహరాజ్, షమ్సీ బౌలింగ్‌ను భారత బ్యాటర్లు చిత్తు చేశారు. బరాబతి పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని ఒక స్పిన్నర్ స్థానంలో అదనంగా మరో పేసర్‌గా ఆడించాలని సఫారీ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మహరాజ్ స్థానంలో పేస్ బౌలర్లు ఇన్‌గిడి లేదా జాన్సెన్‌కు అవకాశం దక్కవచ్చు.
పిచ్, వాతావరణం
పరుగుల వరద పారిన గత మ్యాచ్‌తో పోలిస్తే ఇక్కడి పిచ్ బౌలింగ్‌కు అనుకూలించవచ్చు. గతంలో జరిగిన రెండు టి20ల్లోనూ తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. దక్షిణాఫ్రికాతో ఇదే మైదానంలో 2015లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 92 పరుగులకే కుప్పకూలింది.
తుది జట్లు (అంచనా):
భారత్: పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్, కార్తీక్, అక్షర్, హర్షల్, భువనేశ్వర్, అవేశ్, చహల్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, ప్రిటోరియస్, వాన్ డర్ డసెన్, మిల్లర్, స్టబ్స్, పార్నెల్, రబడ, నోర్జే, షమ్సీ, ఇన్‌గిడి/జాన్సెన్.
Comments
Please login to add a commentAdd a comment