
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలి రోజు టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. మొదటి రోజు ఏకంగా టీమిండియా 4 వికెట్ల నష్టానికి 525 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన సెంచరీతో మెరిసింది. 197 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 27 ఫోర్లు, 8 సిక్స్‌లతో 205 పరుగులు చేయగా.. మంధాన 161 బంతుల్లో 149 పరుగులు చేసింది.
వీరితో పాటు జెమిమా రోడ్రిగ్స్(55) పరుగులతో రాణించింది. ప్రస్తుతం క్రీజులో హర్మన్ ప్రీత్ కౌర్(42), రిచా ఘోష్(43) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డెల్మీ టక్కర్ రెండు వికెట్లు పడగొట్టగా.. డీక్లార్క్ ఒక్క వికెట్ సాధించింది.
చరిత్ర సృష్టించిన టీమిండియా..
ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత ప్రదర్శన కనబరిచిన భారత మహిళల జట్టు అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. పురుషుల, మహిళల టెస్టు క్రికెట్‌లో ఒక రోజులో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది.
అంతకుముందు 2002లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఒకే రోజులో 9 వికెట్లు కోల్పోయి 509 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో లంకేయుల రికార్డును భారత మహిళలు బద్దలు కొట్టారు. ఇప్పటివరకు మహిళల టెస్టు క్రికెట్‌లో అయితే 431 పరుగులే అత్యధిక కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment