వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌లో ఓటమి అనంతరం ఇది జరిగింది. భారత్ రెండో స్థానానికి పడిపోవడంతో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్‌కు చేరుకుంది. భారత్ పాయింట్స్ పర్సంటేజ్ 58.33 కాగా.. ఆస్ట్రేలియాది 62.50గా ఉంది. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, భారత్ తర్వాత శ్రీలంక, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఉన్నాయి.
కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్ 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడింది. న్యూజిలాండ్ స్పిన్నర్లు తమ మాయాజాలంతో స్వల్ప స్కోర్‌ను డిఫెండ్ చేసుకున్నారు. అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్ ధాటికి భారత్ కేవలం 121 పరుగులకే కుప్పకూలింది. అజాజ్ పటేల్ 6 వికెట్లు పడగొట్టగా.. ఫిలిప్స్ 3 వికెట్లతో తీశాడు. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(64) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్ (71), డారిల్ మిచెల్ (82) రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు, ఆకాశ్‌దీప్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన భారత్.. 263 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ (90), రిషబ్ పంత్ (60) అర్ద సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
28 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 174 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్ మూడు, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్ తలో వికెట్ పడగొట్టారు. 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 121 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment