CWG 2030: భారత్‌ సిద్ధం! నిర్వహణ కోసం బిడ్‌ దాఖలు | India Submits Proposal to host Commonwealth Games 2030 Check Details | Sakshi
Sakshi News home page

Commonwealth Games 2030: భారత్‌ సిద్ధం! నిర్వహణ కోసం బిడ్‌ దాఖలు

Published Fri, Mar 21 2025 12:26 PM | Last Updated on Fri, Mar 21 2025 12:26 PM

India Submits Proposal to host Commonwealth Games 2030 Check Details

న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల తర్వాత భారత్‌లో ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ క్రీడలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2030లో జరిగే కామన్వెల్త్‌ క్రీడల (Commonwealth Games 2030) నిర్వహణ కోసం భారత్‌ అధికారికంగా బిడ్‌ను దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం బిడ్‌లో నగరం పేరును కూడా పేర్కొన్నారు. 

భారత్‌కు ఈ క్రీడలు నిర్వహించే అవకాశం దక్కితే వాటికి అహ్మదాబాద్‌ వేదిక అవుతుంది. భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ఈ ప్రక్రియను పూర్తి చేసిందని కేంద్ర క్రీడా శాఖలోని ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.

‘అవును, మనం 2023 కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణ కోసం పోటీ పడుతున్నాం. భారత్‌ తరఫున ఐఓఏ, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా బిడ్‌ను సమర్పించాయి’ అని ఆయన చెప్పారు. నిర్వహణా కమిటీ ‘కామన్వెల్త్‌ స్పోర్ట్‌’ ఈ బిడ్‌ను పరిశీలించిన అనంతరం తదుపరి ప్రక్రియ కోసం పరిగణలోకి తీసుకుంటుంది. 2010లో భారత్‌లో కామన్వెల్త్‌ క్రీడలకు జరిగాయి. 

ప్రధాని నరేంద్ర మోదీ సూచనల ప్రకారం 2036 ఒలింపిక్స్‌ను కూడా మన దేశంలో నిర్వహించాలనే యోచన ఉంది. ఇందు కోసం కూడా ప్రాధమికంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. దానికి ముందు సన్నాహకంగా ఈ కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణతో తమ స్థాయిని ప్రదర్శించాలని భారత్‌ భావిస్తోంది.  

ఆసియా స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు భారత్‌ ఆతిథ్యం
ఆరేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి 15వ తేదీ వరకు ఆసియా స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు అహ్మదాబాద్‌లోని నరన్‌పురా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వేదిక కానుంది. జపాన్, దక్షిణ కొరియా, చైనా తదితర దేశాల నుంచి మేటి స్విమ్మర్లు ఈ మెగా ఈవెంట్‌కు వచ్చే అవకాశముంది.

‘గుజరాత్‌ ప్రభుత్వం, ఆసియా అక్వాటిక్స్‌ నుంచి ఈ మెగా ఈవెంట్‌ నిర్వహణకు ఆమోదం లభించింది. వచ్చే నెలలో ఎంఓయూ కూడా జరుగుతుంది’ అని భారత స్విమ్మింగ్‌ సమాఖ్య సెక్రటరీ జనరల్‌ మోనల్‌ చోక్సి తెలిపారు. 

చివరిసారి భారత్‌ 2019లో ఆసియా ఏజ్‌ గ్రూప్‌ స్విమ్మింగ్‌ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. ఆసియా స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్విమ్మింగ్, డైవింగ్, ఆరి్టస్టిక్‌ స్విమ్మింగ్, వాటర్‌ పోలో ఈవెంట్స్‌ను నిర్వహిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement