సాక్షి, హైదరాబాద్: నాలుగు నెలలలోపే భాగ్యనగర క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ వచ్చేసింది. భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం ఉప్పల్‌లో జరిగే తొలి పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. ఇందుకోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది.
నాలుగు రోజుల పాటు ‘ఆన్‌లైన్’లో టికెట్లు అందుబాటులో ఉంచగా, పూర్తిగా అమ్ముడుపోవడంతో స్టేడియం ‘హౌస్‌ఫుల్’ కావడం ఖాయమైంది. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి టికెట్లను ‘ఆన్‌లైన్’కే పరిమితం చేయడంతో టికెట్ల అమ్మకం విషయంలో ఎలాంటి గందరగోళం, రచ్చ జరగలేదు.
పాకిస్తాన్ పర్యటన నుంచి శనివారమే నేరుగా హైదరాబాద్ వచ్చిన కివీస్ జట్టు రెండు రోజులుగా ప్రాక్టీస్ చేస్తుండగా... లంకతో మూడో వన్డే తర్వాత సోమవారం సాయంత్రం టీమిండియా నగరానికి చేరుకుంది. మంగళవారం ఇరు జట్లు పూర్తి స్థాయిలో సాధన చేస్తాయి. గతంలో ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య 2 టెస్టులు జరగ్గా... కివీస్ జట్టు వన్డే ఆడనుండటం ఇదే మొదటిసారి కానుంది.
సిరాజ్ తొలిసారి...
సొంతగడ్డపై హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తొలిసారి భారత్ తరఫున మ్యాచ్ ఆడనున్నాడు. గతంలో ఐపీఎల్‌లో ఆడినా... అతని 42 అంతర్జాతీయ మ్యాచ్‌ల కెరీర్‌లో హైదరాబాద్‌లో మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు.
ఇప్పుడు అద్భుతమైన ఫామ్‌తో భారత జట్టులో కీలకంగా ఎదిగిన దశలో ఉప్పల్ మైదానంలో తన ఆటతో చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. శ్రీలంకతో సిరీస్‌లో కేవలం 10.22 సగటుతో 9 వికెట్లు తీసిన సిరాజ్‌పై ‘అరుదైన ప్రతిభగలవాడు’ అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు.
చదవండి: IND vs NZ: హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు.. ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment