భారత్‌ బోణీ | India win over Pakistan by 6 wickets | Sakshi
Sakshi News home page

భారత్‌ బోణీ

Published Mon, Oct 7 2024 3:51 AM | Last Updated on Mon, Oct 7 2024 3:51 AM

India win over Pakistan by 6 wickets

6 వికెట్లతో పాకిస్తాన్‌పై విజయం

హడలెత్తించిన అరుంధతి రెడ్డి

రాణించిన షఫాలీ, హర్మన్‌

9న శ్రీలంకతో తదుపరి పోరు

మహిళల టి20 ప్రపంచకప్‌  

భారత మహిళల జట్టు గెలిచింది. ప్రపంచ కప్‌లో బోణీ అయితే కొట్టింది... కానీ బౌలర్లు కట్టుదిట్టంగా ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేస్తే... రన్‌రేట్‌ను మెరుగుపర్చుకునేందుకు ధనాధన్‌గా ఛేదించాల్సిన లక్ష్యం పట్ల మన బ్యాటర్లు నిర్లక్ష్యం వహించారు. 

హైదరాబాదీ సీమర్‌ అరుంధతి రెడ్డి (3/19) అదరగొడితే... పాక్‌ నిర్దేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 7 బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. గ్రూప్‌ ‘ఎ’లో ప్రస్తుతం భారత్, పాకిస్తాన్‌ 2 పాయింట్లతో సమంగా ఉన్నాయి. 

అయితే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా పాకిస్తాన్‌ (0.555) మూడో స్థానంలో ఉండగా... భారత్‌ (–1.217) నాలుగో స్థానంలో నిలిచింది. ఈనెల 9న జరిగే తమ మూడో లీగ్‌ మ్యాచ్‌లో ఆసియా చాంపియన్‌ శ్రీలంకతో భారత్‌ ఆడుతుంది. సెమీఫైనల్‌ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌లోనూ భారత జట్టు తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. 
  
దుబాయ్‌: మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి పాయింట్ల ఖాతా తెరిచింది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా ఆదివారం జరిగిన ఈ పోరులో భారత పేస్‌ బౌలర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అరుంధతి రెడ్డి (3/19), స్పిన్నర్‌ శ్రేయాంక పాటిల్‌ (2/12) సహా రేణుక సింగ్‌ (1/23), దీప్తి శర్మ (1/24), ఆశ శోభన (1/24) ఇలా బౌలింగ్‌కు దిగిన ప్రతి ఒక్కరు సమష్టిగా వికెట్లను పడగొట్టారు. 

దీంతో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన పాకిస్తాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. నిదా దర్‌ (34 బంతుల్లో 28; 1 ఫోర్‌) చేసిన పరుగులే ఇన్నింగ్స్‌ టాప్‌ స్కోర్‌! అనంతరం సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు హర్మన్‌ప్రీత్‌ బృందం ఆఖరిదాకా పోరాడాల్సి వచ్చింది. 

ఇది భారత జట్టు రన్‌రేట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. చివరకు టీమిండియా 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (35 బంతుల్లో 32; 3 ఫోర్లు), హర్మన్‌ప్రీత్‌ (24 బంతుల్లో 29 రిటైర్డ్‌హర్ట్‌; 1 ఫోర్‌) రాణించారు. 

ఆరంభంలోనే తడబాటు 
టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు కష్టాలు స్వాగతం పలికాయి. టాపార్డర్‌ను రేణుక, దీప్తి శర్మ, శ్రేయాంక దెబ్బతీస్తే అరుంధతి నిప్పులు చెరిగే బౌలింగ్‌తో మిడిలార్డర్‌ బ్యాటర్లు ఒమైమా (3), నిదా దర్, ఆలియా రియాజ్‌ (4)లను అవుట్‌ చేయడంతో పాక్‌ 100 పరుగులు చేయడం కూడా కష్టమనిపించింది. 

నష్రా సంధు ఆఖరి రెండు బంతుల్లో 2, 4 పరుగులు రాబట్టడంతో చివరకు పాక్‌ 105 పరుగులు చేయగలిగింది. తర్వాత భారత్‌ ముందున్న లక్ష్యం చిన్నదే అయినా బ్యాటర్లు చకాచకా ఛేదించే సాహసం చేయలేకపోయారు. స్మృతి మంధాన (7) ఆరంభంలోనే అవుటయ్యాక షఫాలీ, జెమీమా రోడ్రిగ్స్‌ (28 బంతుల్లో 23), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ దూకుడు ప్రదర్శించలేదు. 

దీంతో 15, 16 ఓవర్లలో ముగించాల్సిన లక్ష్యం 19వ ఓవర్‌ ఐదో బంతిదాకా సాగింది. ఒక్క సిక్స్‌ కూడా నమోదుకాని ఈ మ్యాచ్‌లో పాక్‌ బ్యాటర్లు 8 ఫోర్లు, భారత బ్యాటర్లు 5 ఫోర్లు కొట్టారు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు దుబాయ్‌లోని భారత్, పాక్‌ అభిమానులు ఊహించని స్థాయిలో పోటెత్తడంతో మైదానం నిండిపోయింది.  

స్కోరు వివరాలు 
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: మునీబా (స్టంప్డ్‌) రిచా (బి) శ్రేయాంక 17; గుల్‌ ఫిరోజా (బి) రేణుక 0; సిద్రా అమిన్‌ (బి) దీప్తి శర్మ 8; ఒమైమా (సి) షఫాలీ (బి) అరుంధతి 3; నిదా దర్‌ (బి) అరుంధతి 28; ఆలియా (ఎల్బీడబ్ల్యూ) (బి) అరుంధతి 4; ఫాతిమా (సి) రిచా (బి) ఆశ శోభన 13; తుబా హసన్‌ (సి) షఫాలీ (బి) శ్రేయాంక 0; సైదా (నాటౌట్‌) 14; నష్రా సంధు (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 105. వికెట్ల పతనం: 1–1, 2–25, 3–33, 4–41, 5–52, 6–70, 7–71, 8–99. బౌలింగ్‌: రేణుక 4–0–23 –1, దీప్తి 4–0–24–1, అరుంధతి 4–0–19–3, శ్రేయాంక 4–1–12–2, ఆశ శోభన 4–0–24–1. 

భారత్‌ ఇన్నింగ్స్‌: షఫాలీ (సి) ఆలియా (బి) ఒమైమా 32; స్మృతి (సి) తుబా (బి) సాదియా 7; జెమీమా (సి) మునీబా (బి) ఫాతిమా 23; హర్మన్‌ప్రీత్‌ (రిటైర్డ్‌హర్ట్‌) 29; రిచా (సి) మునీబా (బి) ఫాతిమా 0; దీప్తి శర్మ (నాటౌట్‌) 7; సజన (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 108. వికెట్ల పతనం: 1–18, 2–61, 3–80, 4–80. బౌలింగ్‌: ఫాతిమా 4–0–23–2, సాదియా 4–0–23–1, నిదా దర్‌ 1.5–0–10–0, ఒమైమా 3–0–17–1, నష్రా సంధు 4–0–21–0, తుబా హసన్‌ 2–0–14–0. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement