టి20ల్లో జట్టు అత్యధిక స్కోర్ నమోదు
60 పరుగుల తేడాతో ఓడిన వెస్టిండీస్
చెలరేగిన స్మృతి ,రిచా ఘోష్
సిరీస్ 2–1తో సొంతం
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు రికార్డు ప్రదర్శనతో వెస్టిండీస్‌తో జరిగిన టి20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌లో, ఆపై బౌలింగ్‌లో చెలరేగిన భారత్ 60 పరుగుల తేడాతో విండీస్ మహిళల జట్టుపై ఘన విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో గెలుచుకుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన (47 బంతుల్లో 77; 13 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ రిచా ఘోష్ (21 బంతుల్లో 54; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో చెలరేగగా... జెమీమా రోడ్రిగ్స్ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు), రాఘ్వీ బిస్త్ (22 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసింది. చినెల్ హెన్రీ (16 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, రాధ యాదవ్‌కు 4 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య ఆదివారం వడోదరలో తొలి వన్డే జరుగుతుంది.
మెరుపు బ్యాటింగ్...
తొలి ఓవర్‌లోనే ఉమా ఛెత్రి (0) అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ పేలవంగా ఆరంభమైంది. అయితే ఆ తర్వాత స్మృతి, జెమీమా కలిసి విండీస్ బౌలర్లపై చెలరేగారు. హెన్రీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టిన స్మృతి... డాటిన్ వేసిన తర్వాతి ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. కరిష్మా ఓవర్లో జెమీమా 3 ఫోర్లు సాధించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 61 పరుగులకు చేరింది.
27 బంతుల్లో ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. రెండో వికెట్‌కు జెమీమాతో 98 పరుగులు (55 బంతుల్లో), మూడో వికెట్‌కు రాఘ్వీతో 44 పరుగులు (27 బంతుల్లో) జోడించిన తర్వాత స్మృతి వెనుదిరిగింది. అయితే ఆ తర్వాత వచి్చన రిచా విరుచుకుపడింది. తన తొలి మూడు బంతులనే 6, 4, 4గా మలచిన ఆమె హేలీ ఓవర్లో వరుసగా 2 సిక్స్‌లు బాదింది.
అలీన్ బౌలింగ్‌లో మరో భారీ సిక్స్‌తో 18 బంతుల్లో రిచా రికార్డు హాఫ్ సెంచరీని అందుకుంది. ఛేదనలో విండీస్ బ్యాటర్లంతా తడబడ్డారు. అసాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒత్తిడికి గురై వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. హెన్రీ కొద్దిగా పోరాడటం మినహా మిగతా వారంతా విఫలం కావడంతో విజయానికి జట్టు చాలా దూరంలో నిలిచిపోయింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) హెన్రీ (బి) డాటిన్ 77; ఉమా ఛెత్రి (సి) జోసెఫ్ (బి) హెన్రీ 0; జెమీమా (ఎల్బీ) (బి) ఫ్లెచర్ 39; రాఘ్వీ బిస్త్ (నాటౌట్) 31; రిచా ఘోష్ (సి) హెన్రీ (బి) అలీన్ 54; సజన (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–1, 2–99, 3–143, 4–213. బౌలింగ్: చినెల్ హెన్రీ 2–0–14–1, డాటిన్ 4–0–54–1, హేలీ మాథ్యూస్ 4–0–34–0, కరిష్మా 3–0–44–0, అలీన్ 4–0–45–1, ఫ్లెచర్ 3–0–24–1.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) సజన (బి) రాధ 22; ఖియానా జోసెఫ్ (సి) టిటాస్ సాధు (బి) సజన 11; డాటిన్ (సి) రాధ (బి) టిటాస్ సాధు 25; క్యాంప్‌బెల్ (సి) స్మృతి (బి) దీప్తి 17; చినెల్ హెన్రీ (సి) రాఘ్వీ (బి) రేణుక 43; క్రాఫ్టన్ (రనౌట్) 9; అలీన్ (బి) రాధ 6; షబిక (సి) సజన (బి) రాధ 3; జైదా (సి) రిచా (బి) రాధ 7; ఫ్లెచర్ (నాటౌట్) 5; కరిష్మా (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–20, 2–57, 3–62, 4–96, 5–129, 6–136, 7–137, 8–142, 9–147. బౌలింగ్: రేణుకా సింగ్ 3–0–16–1, సజీవన్ సజన 2–0–16–1, సైమా ఠాకూర్ 4–0–33–0, టిటాస్ సాధు 3–0–31–1, రాధ యాదవ్ 4–0–29–4, దీప్తి శర్మ 4–0–31–1.
217/4 అంతర్జాతీయ టి20ల్లో భారత మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. ఇదే ఏడాది యూఏఈపై సాధించిన 201/5 స్కోరును భారత్ అధిగమించింది.
18 హాఫ్ సెంచరీకి రిచా తీసుకున్న బంతులు. సోఫీ డివైన్, లిచ్‌ఫీల్డ్ పేరిట వేగవంతమైన అర్ధసెంచరీ రికార్డును రిచా సమం చేసింది.
30 స్మృతి మంధాన అర్ధ సెంచరీల సంఖ్య. సుజీ బేట్స్ (29)ను అధిగమించి అగ్ర స్థానానికి చేరింది.
763 ఈ ఏడాది అంతర్జాతీయ టి20ల్లో స్మృతి చేసిన పరుగులు. క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చమరి అటపట్టు (720) రికార్డును స్మృతి సవరించింది.
Comments
Please login to add a commentAdd a comment