మూడో టి20లో భారత్ విజయం
23 పరుగులతో ఓడిన జింబాబ్వే
రాణించిన గిల్, రుతురాజ్, సుందర్
శనివారం నాలుగో మ్యాచ్
జింబాబ్వేపై వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఆధిపత్యం కొనసాగింది. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు చక్కటి ప్రదర్శన చేయడంతో మరో పోరులో టీమిండియాకు సునాయాస విజయం దక్కింది. టి20 వరల్డ్ కప్‌లో ఆడిన ముగ్గురు ఆటగాళ్ల పునరాగమనంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో కొంత మార్పు వచ్చినా... చివరకు భారత్‌దే పైచేయి అయింది. గత మ్యాచ్ తరహాలోనే ఈసారి కూడా పేలవ బ్యాటింగ్‌తోనే ఆతిథ్య జింబాబ్వే జట్టు ఆరంభంలోనే ఆటను అప్పగించింది. ఇక శనివారం జరిగే నాలుగో మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ మన ఖాతాలో చేరుతుంది.
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్ 2–1తో ముందంజలో నిలిచింది. బుధవారం జరిగిన మూడో టి20లో భారత్ 23 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది.
గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (27 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులే చేయగలిగింది. డియాన్ మైర్స్ (49 బంతుల్లో 65 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), క్లయివ్ మదాండె (26 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వాషింగ్టన్ సుందర్ (3/15) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. శనివారం ఇదే మైదానంలో నాలుగో టి20 జరుగుతుంది.
కీలక భాగస్వామ్యాలు...
భారత్ తమ ఇన్నింగ్స్‌ను జోరుగా ప్రారంభించింది. తొలి ఓవర్లో జైస్వాల్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టగా, రెండో ఓవర్లో గిల్ 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 55 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు గిల్‌తో 50 బంతుల్లో 67 పరుగులు జోడించిన తర్వాత జైస్వాల్ వెనుదిరిగాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో అభిõÙక్ శర్మ (10) ఈసారి ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో జత కలిసిన గిల్, రుతురాజ్ మరింత ధాటిగా ఆడారు.
మదెవెరె ఓవర్లో ఇద్దరూ చెరో సిక్స్ కొట్టగా... ఆ తర్వాత సికందర్ రజా ఓవర్లోనూ ఇదే పునరావృతమైంది. ఎట్టకేలకు గిల్‌ను అవుట్ చేసి ముజరబాని ఈ భాగస్వామ్యాన్ని ముగించాడు. గిల్, రుతురాజ్ మూడో వికెట్‌కు 44 బంతుల్లోనే 72 పరుగులు జత చేశారు. 36 బంతుల్లో గిల్ అర్ధసెంచరీ చేయగా... ఎన్‌గరవ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన రుతురాజ్ అర్ధ సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. జింబాబ్వే పేలవ ఫీల్డింగ్‌తో భారత్‌కు అదనపు అవకాశాలు కల్పించింది.
గిల్, జైస్వాల్, రుతురాజ్ ఇచ్చిన క్యాచ్‌లను ఫీల్డర్లు వదిలేశారు. చివరి 4 ఓవర్లలో భారత్ 52 పరుగులు చేసింది. టి20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యులైన జైస్వాల్, సామ్సన్, దూబే ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగగా... పరాగ్, సాయిసుదర్శన్, జురేల్‌లను పక్కన పెట్టారు.
టపటపా...
భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాటర్లు నిలవలేకపోయారు. 13 బంతుల వ్యవధిలో తొలి 3 వికెట్లు కోల్పోయిన జట్టు ఆ తర్వాత ఒకే ఓవర్లో మరో 2 వికెట్లు చేజార్చుకుంది. 7 ఓవర్లు ముగిసేసరికి 39/5తో జింబాబ్వే ఓటమికి బాటలు వేసుకుంది. ఈ దశలో మైర్స్, మదాండె కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.
వీరిద్దరు ఆరో వికెట్‌కు 57 బంతుల్లోనే 77 పరుగులు జోడించారు. అనంతరం 45 బంతుల్లో మైర్స్ తన కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీని అందుకున్నాడు. చివర్లో ఓవర్లో మైర్స్, మసకద్జా (10 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి 18 పరుగులు రాబట్టినా... అప్పటికే ఓటమి ఖాయమైంది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బెన్నెట్ (బి) రజా 36; గిల్ (సి) రజా (బి) ముజరబాని 66; అభిõÙక్ (సి) మరుమని (బి) రజా 10; రుతురాజ్ (సి) మదెవెరె (బి) ముజరబాని 49; సామ్సన్ (నాటౌట్) 12; రింకూ సింగ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–67, 2–81, 3–153, 4–177. బౌలింగ్: బెన్నెట్ 1–0–15–0, ఎన్‌గరవ 4–0–39–0, చటారా 3–0–30–0, ముజరబాని 4–0–25–2, రజా 4–0–24–2, మసకద్జా 3–0–25–0, మదెవెరె 1–0–19–0.
జింబాబ్వే ఇన్నింగ్స్: మదెవెరె (సి) అభిషేక్ (బి) అవేశ్ 1; మరుమని (సి) దూబే (బి) ఖలీల్ 13; బెన్నెట్ (సి) బిష్ణోయ్ (బి) అవేశ్ 4; మైర్స్ (నాటౌట్) 65; రజా (సి) రింకూ (బి) సుందర్ 15; క్యాంప్‌బెల్ (సి) (సబ్) పరాగ్ (బి) సుందర్ 1; మదాండె (సి) రింకూ (బి) సుందర్ 37; మసకద్జా (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–9, 2–19, 3–19, 4–37, 5–39, 6–116. బౌలింగ్: ఖలీల్ 4–0–15–1, అవేశ్ 4–0–39–2, రవి బిష్ణోయ్ 4–0–37–0, వాషింగ్టన్ సుందర్ 4–0–15–3, అభిషేక్ 2–0–23–0, దూబే 2–0–27–0.
150 అంతర్జాతీయ టి20ల్లో భారత్ సాధించిన విజయాల సంఖ్య. ఇప్పటి వరకు 230 టి20 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 150 మ్యాచ్‌ల్లో గెలిచి ఈ మైలురాయి అందుకున్న తొలి జట్టుగా నిలిచింది. పాకిస్తాన్ (142), న్యూజిలాండ్ (111), ఆ్రస్టేలియా (105), దక్షిణాఫ్రికా (104), ఇంగ్లండ్ (100) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment