Paris Olympics: పర్వీన్‌ హుడాపై నిషేధం.. విశ్వ క్రీడలకు దూరం | Indian Boxer Parveen Hooda Suspended, BFI Set To Field Jaismine To Retake 57kg Quota | Sakshi
Sakshi News home page

Paris Olympics 2024: పర్వీన్‌ హుడాపై నిషేధం.. విశ్వ క్రీడలకు దూరం

Published Sat, May 18 2024 9:57 AM | Last Updated on Sat, May 18 2024 10:29 AM

Indian Boxer Parveen Hooda Suspended, BFI Set To Field Jaismine To Retake 57kg Quota

పారిస్‌ ఒలింపిక్స్‌కు దూరమైన భారత మహిళా బాక్సర్‌

57 కేజీల విభాగంలో మళ్లీ బెర్త్‌ కోసం పోటీపడనున్న భారత్‌ 

Parveen Hooda suspended- భారత మహిళా బాక్సర్‌ పర్వీన్‌ హుడా పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ను కోల్పోయింది. ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) సస్పెన్షన్‌ వల్లే ఆమె పారిస్‌ విశ్వక్రీడలకు దూరం కానుంది.

‘వాడా’ రిజిస్టర్డ్‌ టెస్టింగ్‌ పూల్‌ (ఆర్టీపీ) నియమావళి ప్రకారం ఆమె ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే సమాచారాన్ని ఇవ్వడంలో విఫలమైంది. గత 12 నెలలుగా మూడుసార్లు పరీ్వన్‌ ఈ సమాచారాన్ని ఇవ్వలేకపోవడంతో ‘వాడా’ ఆమెపై 22 నెలలు నిషేధం విధించింది. పర్వీన్‌ ఈ తప్పిదాన్ని ఉద్దేశపూర్వకంగా చేయలేదని ‘వాడా’ అధికారులకు భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) వివరణ ఇచ్చింది.

దాంతో ‘వాడా’ ఈ నిషేధాన్ని 14 నెలలకు కుదించింది. శుక్రవారంతో మొదలైన ఈ నిషేధం వచ్చే ఏడాది జూలై వరకు కొనసాగుతుందని బీఎఫ్‌ఐ తెలిపింది. గత ఏడాది హాంగ్జౌలో జరిగిన జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల 57 కేజీల కేటగిరీలో పర్వీన్‌ కాంస్య పతకం సాధించి పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 

ఇక పర్వీన్‌పై నిషేధం నేపథ్యంలో ఇప్పుడు 57 కేజీల విభాగంలో బెర్త్‌ ఖాళీ అయింది. ఈ క్రమంలో.. పర్వీన్‌ స్థానంలో జాస్మిన్‌ లాంబోరియాను బీఎఫ్‌ఐ.. వరల్డ్‌ క్వాలిఫయర్‌-2 బరిలో దించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. పారిస్‌ ఒలింపిక్స్‌లో మహిళల, పురుషుల విభాగాలలో ఏడు చొప్పున ఒలింపిక్‌ వెయిట్‌ కేటగిరీలు ఉండగా... భారత్‌ నుంచి ఇప్పటికే ముగ్గురు మహిళా బాక్సర్లు (నిఖత్‌ జరీన్‌–50 కేజీలు; ప్రీతి–54 కేజీలు; లవ్లీనా బొర్గొహైన్‌–75 కేజీలు) పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. 

పురుషుల విభాగంలో భారత్‌ నుంచి ఎవరూ అర్హత సాధించలేదు. పర్వీన్‌పై నిషేధం కారణంగా... ఈనెల 23 నుంచి జూన్‌ 3 వరకు బ్యాంకాక్‌లో జరిగే వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భారత్‌ మహిళల విభాగంలో మూడు వెయిట్‌ కేటగిరీల్లో (57, 60, 66 కేజీలు), పురుషుల విభాగంలో ఏడు వెయిట్‌ కేటగిరీల్లో పోటీపడుతుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement