సాక్షి, చెన్నై: ఫార్ములా కార్ రేస్ ఆదివారం అదరహో అనిపించే విధంగా జరిగింది. వినోదంతో కూడిన సాహసాలు హోరెత్తాయి. సినీ సెలబ్రిటీలు సందడి చేశారు. చెన్నై ఐలాండ్ గ్రౌండ్ వేదికగా ఫార్ములా కార్ రేస్ –4 శనివారం మొదలైన విషయం తెలిసిందే. తొలిరోజు అర్హత పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి.
రెండవ రోజు ఆదివారం ఉదయం నుంచి ట్రయల్ రన్ పేరిట పోటీలు హోరెత్తాయి. అలాగే, నగర వాసులు, ప్రేక్షకులను ఆకర్షించే దిశగా వినోద కార్యక్రమాలు, సాహసాలతో కూడిన కార్ రేసులు సాగాయి. జేకే టైర్ కార్ రేస్ ప్రత్యేక ఆకర్షణగా దూసుకెళ్లింది.
ఆదివారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు తుది పోటీలు ఇండియన్ చాంపియన్‌షిప్, ఇండియన్ రేసింగ్ లీగ్ కేటగిరిలలో జరిగాయి. అత్యంత పోటాపోటీగా ఉత్కంఠ భరితంగా గాల్లో 200 కి.మీకి పైగా వేగంతో కార్లు దూసుకెళ్లాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు పోటీలలో విజయాన్ని కైవశం చేసుకునే దిశగా రేసులో దూసుకెళ్లారు.
చివరి రోజు పోటీలను వీక్షించేందుక ప్రత్యేక ఆకర్షణగా త్రిష వంటి సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. అలాగే, భారత మాజీ క్రికెటర్ గంగూలి, బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్, జాన్‌అబ్రహం, నిర్మాత బోనికపూర్‌తో పాటు పలువురు నటీ నటులు హాజరయ్యారు. కోలీవుడ్‌కు చెందిన అనేక మంది స్టార్లు తరలి వచ్చారు.
సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే, టాలీవుడ్ స్టార్ నాగచైతన్య ఈ ఫార్ములాకు మరింత ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. అర్ధరాత్రి జరిగిన విజయోత్సవంలో మరెందరో సినీ, క్రీడా సెలబ్రిటీలు సందడి చేశారు.
శునకాల కోసం వేట
కార్ రేస్‌కు శునకాలు పెద్ద సమస్యగా మారాయి. ఈ రేస్ జరిగే పరిసరాలలో కూవం నదీ తీరంలోని కొన్ని మురికి వాడలు ఉన్నాయి. ఇక్కడ శునకాలు ఎక్కవ. శనివారం రేస్ సమయంలో ఓ శునకం ట్రాక్‌లోకి దూసుకు రావడంతో రైడర్లు అలర్ట్ అయ్యారు. ఆ శునకం ట్రాక్‌ను రేస్ కారు వేగంతో దాటేయడంతో పెనుప్రమాదం తప్పినట్టైంది.
దీంతో ఆదివారం రేసుకు శునకాల రూపంలో ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తలు పడ్డారు. ఆదివారం ఉదయం నుంచి ఆ పరిసరాలలో శునకాల కోసం కార్పొరేషన్ సిబ్బంది తీవ్ర వేట సాగించారు. పదికి పైగా శునకాలను పట్టేశారు. రాత్రి జరిగిన ఫైనల్స్‌లోకి శునకాలు ట్రాక్ వైపుగా దూసుకు రాకుండా డేగ కళ్లతో కార్పొరేషన్ సిబ్బంది నిఘా వేయాల్సి వచ్చింది.
Lovely! Normal Traffic on the left lane! Races on the right lane..👌🏎️#Formula4Chennai
pic.twitter.com/2fqMd5KDSY— Chennai Updates (@UpdatesChennai) September 1, 2024
Comments
Please login to add a commentAdd a comment