పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్
ఈవెంట్ ఫైనల్లో భారత షూటర్ స్వప్నిల్
ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత షూటర్‌గా ఘనత
క్వాలిఫయింగ్‌లో ఏడో స్థానంతో ఫైనల్‌కు అర్హత
నేడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పతకం కోసం పోటీ
మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన భారత షూటర్లు పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం నిలకడగా రాణిస్తున్నారు. ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మనూ భాకర్–సరబ్‌జోత్ కాంస్య పతకాలు అందించారు. అంతా అనుకున్నట్లు జరిగితే నేడు భారత్ ఖాతాలో షూటింగ్ ద్వారా మూడో పతకం చేరుతుంది. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో భారత్ తరఫున స్వప్నిల్ కుసాలే, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ బరిలోకి దిగారు. స్వప్నిల్ ఏడో స్థానంలో నిలిచి ఫైనల్లోకి దూసుకెళ్లగా... ఐశ్వర్య ప్రతాప్ సింగ్ 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
పారిస్: అంతగా అంచనాలు లేకుండా తొలిసారి ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగిన భారత షూటర్ స్వప్నిల్ కుసాలే అదరగొట్టాడు. ఆద్యంతం నిలకడగా పాయింట్లు సాధించి పతకం రేసులో నిలిచాడు. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల స్వప్నిల్ 590 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
మొత్తం 44 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో టాప్–8లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. భారత్‌కే చెందిన ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ కూడా క్వాలిఫయింగ్‌లో పాల్గొని 589 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు. ఒలింపిక్స్ క్రీడల్లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారత షూటర్‌గా స్వప్నిల్ గుర్తింపు పొందాడు.
‘త్రీ పొజిషన్స్’ అని ఈవెంట్ పేరులో ఉన్నట్టే షూటర్లు వేర్వేరు మూడు భంగిమల్లో లక్ష్యం దిశగా షాట్‌లు సంధిస్తారు. తొలి సిరీస్‌లో షూటర్లు మోకాళ్లపై (నీలింగ్) కూర్చోని షూట్ చేస్తారు. రెండో సిరీస్‌లో సైనిక భంగిమ (ప్రోన్)లో షూట్ చేస్తారు. చివరిదైన మూడో సిరీస్‌లో నిల్చోని (స్టాండింగ్) లక్ష్యం వైపు షాట్‌లు కొడతారు. ఈ మూడు భంగిమల్లో స్కోరు చేసిన పాయింట్ల ఆధారంగా ర్యాంక్‌ను నిర్ణయిస్తారు. అత్యధికంగా పాయింట్లు సాధించి తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.
మహిళల రైఫిల్ త్రీ పొజిషన్స్ విభాగంలో ప్రపంచ మాజీ చాంపియన్, మహారాష్ట్రకే చెందిన తేజస్విని సావంత్ వద్ద శిక్షణ తీసుకుంటున్న స్వప్నిల్ క్వాలిఫయింగ్‌లో సంయమనం కోల్పోకుండా, ఏకాగ్రతతో షూట్ చేశాడు. ముందుగా ‘నీలింగ్’ సిరీస్‌లో 198 పాయింట్లు... ‘ప్రోన్’ సిరీస్‌లో 197 పాయింట్లు... చివరిదైన ‘స్టాండింగ్’ సిరీస్‌లో 195 పాయింట్లు స్కోరు చేశాడు. స్వప్నిల్‌తోపాటు జిరీ ప్రివ్రత్‌స్కయ్ (చెక్ రిపబ్లిక్), పీటర్ నింబర్‌స్కయ్ (చెక్ రిపబ్లిక్) కూడా 590 పాయింట్లు స్కోరు చేశారు.
అయితే ఈ ముగ్గురిలో 10 పాయింట్ల షాట్‌లు స్వప్నిల్ (38 సార్లు), జిరీ (35 సార్లు) ఎక్కువగా కొట్టడంతో ఏడు, ఎనిమిదో ర్యాంక్‌లతో ఫైనల్‌కు చేరగా... పీటర్ (32 సార్లు) తొమ్మిదో స్థానంతో ఫైనల్ అవకాశాన్ని కోల్పోయాడు. ఐశ్వర్య ప్రతాప్ సింగ్ ‘నీలింగ్’లో 197 పాయింట్లు... ‘ప్రోన్’లో 193 పాయింట్లు... ‘స్టాండింగ్’లో 193 పాయింట్లు స్కోరు చేసి 589 పాయింట్లతో 11వ స్థానాన్ని సంపాదించాడు.
లియు యుకున్ (చైనా; 594 పాయింట్లు), జాన్ హెర్మన్ హెగ్ (నార్వే; 593 పాయింట్లు), సెర్హీ కులిష్ (ఉక్రెయిన్; 592 పాయింట్లు), డెనిస్ బెర్నార్డ్ లుకాస్ (ఫ్రాన్స్; 592 పాయింట్లు), లాజర్ కొవాసెవిచ్ (సెర్బియా; 592 పాయింట్లు), టొమాస్ బార్ట్‌నిక్ (పోలాండ్; 591 పాయింట్లు) వరుసగా తొలి ఆరు స్థానాల్లో నిలిచి స్వప్నిల్, జిరీలతో కలిసి నేడు జరిగే ఫైనల్లో పతకాల కోసం పోటీపడతారు.
రాజేశ్వరి, శ్రేయసి విఫలం
మహిళల ట్రాప్ ఈవెంట్‌లో భారత్ నుంచి ఇద్దరు షూటర్లు రాజేశ్వరి కుమారి, శ్రేయసి సింగ్ బరిలోకి దిగారు. మొత్తం 30 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో రాజేశ్వరి, శ్రేయసి 113 పాయింట్లు స్కోరు చేసి వరుసగా 22వ, 23వ స్థానాల్లో నిలిచారు. టాప్–6లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.
రోయింగ్ సెమీస్‌లో బల్‌రాజ్‌కు ఆరో స్థానం
భారత రోవర్ బల్‌రాజ్ పన్వర్ పారిస్ ఒలింపిక్స్ సింగిల్స్ స్కల్స్ సెమీఫైనల్లో ఆరో స్థానంలో నిలిచాడు. బుధవారం జరిగిన పోటీల్లో పన్వర్ 7 నిమిషాల 4.97 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. ఇక 19 నుంచి 24 స్థానాల కోసం శనివారం జరగనున్న పోటీలో బల్‌రాజ్ బరిలోకి దిగనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment