కచ్చితంగా స్వర్ణ పతకంతో తిరిగి వస్తుందనుకున్న భారత స్టార్ బాక్సర్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్‌కు ఆసియా క్రీడల్లో అనూహ్య ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మహిళల 50 కేజీల విభాగం సెమీఫైనల్లో నిఖత్ 2–3తో రక్సత్ చుథామట్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. దాంతో ఈ తెలంగాణ బాక్సర్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రక్సత్‌ను అలవోకగా ఓడించిన నిఖత్‌కు ఈసారి గట్టిపోటీ ఎదురైంది.
పక్కా ప్రణాళికతో ఈ బౌట్‌లో దిగిన రక్సత్ భారత బాక్సర్‌ను నిలువరించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు స్వర్ణాలు నెగ్గిన నిఖత్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకంతో సంతృప్తి పడింది. మరోవైపు భారత్‌కే చెందిన పర్వీన్ హుడా (63 కేజీలు) సెమీఫైనల్ చేరుకొని కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకోవడంతోపాటు పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించింది.
క్వార్టర్ ఫైనల్లో పర్విన్ హుడా 5–0తో తుర్దిబెకోవా సితోరా (ఉజ్బెకిస్తాన్)పై గెలిచింది. అయితే జాస్మిన్ (60 కేజీలు) పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ఉంగ్‌యోంగ్ వన్ (ఉత్తర కొరియా) సంధించిన పంచ్‌లకు జాస్మిన్ తట్టుకోలేకపోయింది. దాంతో రిఫరీ రెండో రౌండ్‌లో బౌట్‌ను ముగించి ఉంగ్‌యోంగ్‌ను విజేతగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment