
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మోటార్ సైక్లింగ్ సమాఖ్య (ఎఫ్‌ఐఎం) నిర్వహించే ప్రతిష్టాత్మక ఇ–ఎక్స్‌ప్లోరర్ ఈవెంట్‌లో తొలిసారి భారత జట్టు ప్రాతినిధ్యం వహించనుంది. 2024 సీజన్‌లో భారత్‌కు చెందిన ‘ఇండి రేసింగ్’ టీమ్ బరిలోకి దిగుతుంది. అధికారికంగా ఎఫ్‌ఐఎం అనుమతించిన రేసింగ్ పోటీల్లో పాల్గొనే తొలి టీమ్ ‘ఇండి రేసింగ్’ అవుతుంది. ఈ జట్టు యజమాని కంకణాల అభిశేక్ రెడ్డి ఈ విషయాలు వెల్లడించారు. తాజా సీజన్ రేస్‌లు జపాన్‌లో వచ్చే ఫిబ్రవరిలో మొదలవుతాయి.
నవంబర్‌లో హైదరాబాద్‌లోనే రేసింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఇండి రేసింగ్ టీమ్ తరఫున ఐశ్వర్య పిస్సే, స్పెన్సర్ విల్టన్, సాండ్రా గోమెజ్ పోటీ పడతారు. భారత్‌లో మోటార్ స్పోర్ట్స్‌పై ఆసక్తి ఇటీవల చాలా పెరిగిందని, అయితే పోటీల్లోకి వచ్చేసరికి మన టీమ్‌కు ప్రాతినిధ్యం లేదని కంకణాల స్పోర్ట్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు అభిశేక్ రెడ్డి అన్నారు. ఇప్పుడు తమ జట్టు ఇండి రేసింగ్ ఆ అవకాశం కలి్పస్తుందని, ఎక్కువ మంది దీనివైపు మళ్లేలా తమ ప్రయత్నం ఉపకరిస్తుందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment